పార్టీని గాడిలో పెట్టేందుకు సోనియా కఠిన నిర్ణయం!
-ఐదు రాష్ట్రాల్లో పార్టీ ప్రక్షాళన.. రంగంలోకి ఐదుగురు సీనియర్లు
-జితేంద్రసింగ్ కు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు
-పంజాబ్ కు అజయ్ మాకెన్
-పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులతో మాట్లాడండి
-తీసుకోవాల్సిన మార్పులను సూచించండి
-నేతలకు సోనియా నిర్దేశం
ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయానికి కారణాలను అన్వేషించి, లోపాలను చక్కదిద్దే కార్యక్రమానికి అధ్యక్షురాలు సోనియాగాంధీ నడుంబిగించారు. ఇందుకు ఆమె కొన్ని కఠిన నిర్ణయాలకు కూడా వెనకాడబోరని తెలుస్తుంది. కొందరు అసమ్మతి వాదుల చర్యలను కూడా ఆమె నిశితంతగా పరిశీలిస్తున్నారు . జి – 23 నేతలు ప్రత్యేకసమావేశాలతో పార్టీని ఇరకాటంలో పెట్టె పనిలో ఉన్న వాటిని లెక్క చేయకుండా సోనియా ముందుకు సాగాలని నిర్ణయించారు . అందుకు అనుగుణంగానే ఐదు రాష్ట్రాలలో పీసీసీ అధ్యక్షులను తొలగించాలని తొలుత భావించారు . 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని పటిష్ఠం చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ముందుగా పార్టీ ఓటమి పాలైన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను రాజీనామా చేయాలని ఆమె ఆదేశించారు.
అనంతరం ఐదుగురు సీనియర్ నేతలను ఆమె రంగంలోకి దింపారు. ఎన్నికల అనంతరం ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను విశ్లేషించి, సంస్థాగత మార్పులను సూచించాలని వారికి బాధ్యతలు అప్పగించారు. పంజాబ్ లో ఈ బాధ్యతలను అజయ్ మాకెన్ కు అప్పగించగా.. మణిపూర్ బాధ్యతలను జైరామ్ రమేశ్ కు ఇచ్చారు. గోవాకు రజని పాటిల్, ఉత్తరప్రదేశ్ కు జితేంద్ర సింగ్, ఉత్తరాఖండ్ కు అవినాష్ పాండేను నియమించారు.
ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలతో మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకుని, చేపట్టాల్సిన చర్యలు, సంస్కరణలను పార్టీ చీఫ్ కు సూచించనున్నారు. దీనిపై పెద్ద కసరత్తే జరుగుతుంది. అదే సందర్భంలో జి- 23 నేతల వ్యవహార శైలిపై సోనియా విధేయులు భగ్గుభగ్గు మంటున్నారు. వారు పార్టీ ని బాగుచేసే పనిలో లేరని కావాలనే వారు పార్టీని చీల్చటానికి ప్రయత్నిస్తున్నారని సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు . దీనిపై సోనియాసైతం కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం ….