- దోపిడీ కేసులో అరెస్ట్ అయిన రవీందర్ ఓఝా
- విడిపించుకునేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిన బంధువులు
- ఐపీఎస్ అధికారులుగా పరిచయం చేసుకున్న వైనం
- అనుమానంతో పోలీసులకు అప్పగింత
- తెలంగాణ పోలీసులకు సమాచారం
దోపిడీ యత్నం కేసులో అరెస్టై కోల్‌కతాలోని జైలులో ఉన్న తమ వాడిని విడిపించుకునేందుకు ఇద్దరు హైదరాబాదీలు ఐపీఎస్ అధికారుల వేషం వేశారు. నేరుగా న్యాయమూర్తిని కలిసి తమ వాడిని విడిచిపెడితే లంచం ఇస్తామని ఆశజూపారు. ప్రస్తుతం వీరిద్దరు కూడా కోల్‌కతాలో జైలు ఊచలు లెక్కపెట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలో దోపిడీ యత్నం కేసులో గతేడాది జులైలో రవీందర్ ఓఝా అరెస్ట్ అయ్యాడు. తమ బంధువైన అతడిని విడిపించుకునేందుకు హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌కు చెందిన ఆశిష్ ప్రకాశ్ పండిట్ (40), రామ్‌కోఠి ప్రాంతానికి చెందిన యశ్పాల్ శర్మ (41) కలిసి కోల్‌కతా వెళ్లారు.
9వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి న్యాయస్థానానికి వెళ్లారు. తమను తాము ఐపీఎస్ అధికారులుగా చెప్పుకుంటూ ఓ ఐడీకార్డును సిబ్బందికి ఇచ్చి న్యాయమూర్తిని కలవాలని చెప్పారు. దీంతో వారు లోపలికి పంపారు. న్యాయమూర్తిని కలిసిన ఆశిష్, యశ్పాల్ తాము హైదరాబాద్ నుంచి వచ్చామని, ఐపీఎస్ అధికారులమని చెబుతూ.. రవీందర్ ఓఝా కేసును ప్రస్తావించారు. అతడిని విడిచిపెట్టాలని కోరారు. లంచం కూడా ఇస్తామన్నారు.
వారి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో న్యాయమూర్తి వెంటనే సిబ్బందిని పిలిచి వారిని పోలీసులకు అప్పగించాల్సిందిగా ఆదేశించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఓఝా తమ బంధువు కావడంతో విడిపించుకునేందుకే వారిలా ఐపీఎస్ వేషాల్లో వచ్చినట్టు విచారణలో తేలింది. రవీందర్‌పై యాంటీ రౌడీ సెక్షన్ ప్రయోగించడంతో ప్రస్తుతం అతడు అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. నిందితులిద్దరినీ జుడీషియల్ రిమాండ్‌కు పంపిన కోల్‌కతా పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు.