- ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై విసుర్లు
- పండిట్ల వలసలకు తానే కారణమంటూ నిరూపించాలని సవాల్
- అమాయకులను ఇరికించి బలి చేయొద్దని ఫరూఖ్ విజ్ఞప్తి
కశ్మీరీ పండిట్ల వలసలకు నేనే కారణమని రుజువైతే, నన్ను ఉరితీయండి అంటూ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా సవాల్ విసిరారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ రేపుతున్న ప్రభంజనం నేపథ్యంలో ఆయన స్పందించారు. నిజాయతీపరులైన న్యాయమూర్తి లేదా కమిటీతో దర్యాప్తు చేయిస్తే అసలు విషయాలు బయటపడతాయని, ఎవరు బాధ్యులన్నది తెలుస్తందని చెప్పారు.
కశ్మీరీ పండిట్లపై అఘాయిత్యాలకు ఫరూఖ్ అబ్దుల్లా కారణమని తేలితే.. ఆ ఫరూఖ్ అబ్దుల్లా ఉరికి సిద్ధమన్నారు. విచారణకు తాను సిద్ధమని, కానీ, ఏమీ తెలియని అమాయకులను ఇందులో ఇరికించి బలి చేయవద్దని కోరారు. కశ్మీరీ పండిట్ల వలసలకు తాను ఎలాంటి కారణమూ కాదన్నారు. నిజానిజాలేంటో తెలియాలంటే ఆనాటి ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి లేదా ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రస్తుత కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ను అడగాలని చెప్పారు.
ఒక్క కశ్మీరీ పండిట్లకే జరిగిన అన్యాయాన్నే కాకుండా సిక్కులు, ముస్లింలకూ జరిగిన అన్యాయాలనూ నిజనిర్ధారణ కమిటీ వెల్లడించాలన్నారు. కాగా, ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా రెచ్చగొట్టేలా ఉందని, అది కేవలం ప్రచార ఆర్భాటం కోసం తీసిందని ఆయన కొట్టిపారేశారు. హిందువులు, ముస్లింలకు జరిగిన ఆనాటి విషాదాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి సొమ్ము చేసుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఆ ఘటనను తలచుకుంటే ఇప్పటికీ తన హృదయం తరుక్కుపోతుంటుందన్నారు.