కేంద్రం తెలంగాణ సర్కార్ మధ్య వడ్లు కొనుగోలుపై యుద్ధం…
-పరస్పర విమర్శలు కేసీఆర్ సర్కారుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఫైర్
-ధాన్యం సేకరణలో తెలంగాణపై వివక్ష లేదన్న మంత్రి
-అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో సేకరణ
-కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న కేంద్ర మంత్రి గోయల్
-పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన నిరంజన్ రెడ్డి
-గోయల్ వ్యాఖ్యలపై మండిపడ్డ నిరంజన్ రెడ్డి
-కేంద్రానిది వ్యాపారాత్మక ధోరణి అని ఆరోపణ
-తెలంగాణ వ్యాపితంగా నిరసనలు …
తెలంగాణాలో వడ్ల కొనుగోళ్లపై కేంద్రం రాష్ట్రప్రభుత్వాలు పరస్పరం నిందించుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని దానికి రాష్ట్రప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయాలు చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఫైర్ అయ్యారు . కేంద్రమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందం కేంద్రం మంత్రి మాటలపై మండిపడింది . మరోపక్క తెలంగాణ వ్యాపితంగా కేంద్రం ధాన్యం కొనుగోళ్లలో చూపిస్తున్న వివక్షతకు వ్యతిరేకంగా టీఆర్ యస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
తెలంగాణలో ఈ యాసంగిలో పండే ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న కేసీఆర్ సర్కారుపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కారును ఆయన రైతు వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణించారు. టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కూడా గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం సేకరణకు సంబంధించి తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్న గోయల్.. ఒప్పందం ప్రకారమే ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి కూడా రా రైస్‌ను సేకరిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.
అయితే, అన్ని రాష్ట్రాలు కేంద్రానికి ఎంత మేర రా రైస్ అందిస్తున్నాయన్న విషయాన్ని చెప్పాయని.. ఒక్క తెలంగాణ మాత్రం ఆ వివరాలు అందజేయడం లేదని కూడా గోయల్ ఆరోపించారు. ఈ విషయంలో తాము ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ సర్కారు నుంచి స్పందన ఉండటం లేదని గోయల్ మండిపడ్డారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ యాసంగిలో తెలంగాణలో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా కేంద్రాన్ని ఒప్పించేందుకు సీఎం కేసీఆర్ మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపారు. ఆ బృందానికి ఇప్పటిదాకా అపాయింట్‌మెంట్ ఇవ్వని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురువారం కేసీఆర్ సర్కారుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన ఆరోపించారు.
పీయూష్ గోయల్ వ్యాఖ్యలు విన్నంతనే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. “కేంద్రానిది వ్యాపారాత్మక ధోరణి మాత్రమే. ఉద్యమిస్తున్న రైతులను చంపి క్షమాపణ చెప్పారు. తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పే రోజు కచ్చితంగా వస్తుంది. తెలంగాణ రైతుల సమస్యలు పరిష్కరించకుండా మాటలు చెబుతారా? చిత్తశుద్ధి ఉంటే ప్రధాని సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయండి. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా?” అంటూ నిరంజన్ రెడ్డి విరుచుకుపడ్డారు.