మహిళా ఐపీఎస్ రాత్రిపూట సైకిల్ పై గస్తీ సీఎం అభినందన!
-ఐపీఎస్ అధికారిని అభినందించిన స్టాలిన్
-ఫ్లవర్ బజార్ నుంచి చాకలిపేట వరకు గస్తీ
-అనుమానితులను విచారించిన రమ్యభారతి
ఆమె ఐపీఎస్ అధికారిణి. పేరు రమ్యభారతి. 2008 ఐపీఎస్ బ్యాచ్. ప్రస్తుతం గ్రేటర్ చెన్నై ఉత్తర మండల డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల పట్ల ఆమెకున్న అంకితభావానికి స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఫిదా అయ్యారు. నగరంలో రాత్రివేళ ఏం జరుగుతోందన్న విషయం తెలుసుకునేందుకు ఆమె సైకిల్‌పై గస్తీ నిర్వహించారు.
పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉన్నదీ, లేనిదీ స్వయంగా పర్యటించి తెలుసుకున్నారు. ఆ సమయంలో రోడ్లపై కనిపించిన అనుమానితులను విచారించారు. గురువారం రాత్రి ఆమె చెన్నైలోని ఫ్లవర్ బజార్ నుంచి చాకలిపేట వరకు సైకిల్‌పై గస్తీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి తిరిగి తిరిగి ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టికి చేరాయి. ప్రస్తుతం ఆయన దుబాయ్ పర్యటనలో ఉన్నారు. అయినప్పటికీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. రమ్యభారతికి అభినందనలు తెలిపారు.
ఒక మహిళా ఐపీఎస్ అధికారి ఇలా రాత్రిపూట గస్తీ తిరగటం పై ఇప్పడు దేశవ్యాపితంగా చర్చనీయాంశం అయింది. ఆమెను పలువురు అధికారులు రాజకీయనేతలు అభినందిస్తున్నారు . డ్యూటీ పట్ల అంకిత భావానికి ప్రసంశలు కురిపిస్తున్నారు . ఆమెను చూసి నేర్చుకోండని పలువురు అధికారులు తమ కింది ఉద్యోగులకు చెబుతున్నారు .