బెంగాల్ అసెంబ్లీ లో బీర్బమ్ హీట్ …ఐదుగురు బీజేపీ సభ్యుల సస్పెన్షన్!
-ఇటు బెంగాల్ అసెంబ్లీలో రచ్చ.. అటు ఢిల్లీలో అమిత్‌షాతో గవర్నర్ భేటీ
-బీర్భూమ్ ఘటనపై చర్చకు బీజేపీ పట్టు
-బీజేపీ, తృణమూల్ సభ్యుల మధ్య తోపులాట
-ప్రతిపక్ష నేత సువేందు సహా ఐదుగురు బీజేపీ సభ్యుల సస్పెన్షన్
-బీర్భూమ్ ఘటనపై అమిత్ షాకు నివేదిక సమర్పించిన గవర్నర్
పశ్చిమ బెంగాల్‌లో సోమవారం వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీర్భూమ్ సజీవ దహనం ఘటనపై విపక్ష బీజేపీ అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టగా సభలో పెద్ద ఎత్తున రచ్చ చోటుచేసుకుంది. అదే సమయంలో ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్ భేటీ అయ్యారు. బీర్బమ్ ఘటనపై రాష్టంలో అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ చూస్తుండగా , బీజేపీ తన రాజకీయ ప్రయాజనాలకోసమే బీర్బమ్ ను ఉపయోగించు కుంటుందని టీఎంసీ ప్రత్యారోపణలు చేస్తుంది. ఇరు పార్టీలు ఎవరికీ వారు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు . పశ్చిమ బెంగాల్ గవర్నర్ సైతం కేంద్రం హోమ్ మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది .
సోమవారం బెంగాల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బీర్భూమ్ ఘటనపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ విపక్ష బీజేపీ పట్టుబట్టింది. అందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్ ససేమిరా అనడంతో సభలో గలాటా మొదలైంది. ఈ సందర్భంగా ఇరు పార్టీలకు చెందిన సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకానొక సమయంలో ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. దీంతో సభలో ప్రధాన ప్రతిపక్ష నేత సువేందు అధికారి సహా ఐదుగురు బీజేపీ సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఓ వైపు సభలో ఈ గలాటా జరుగుతున్న సమయంలోనే బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్ కర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బీర్భూమ్ ఘటనపై నివేదిక అందించడంతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలో తాజా పరిస్థితిపైనా ఆయన అమిత్ షాకు నివేదిక అందించినట్లు సమాచారం.