ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. విషయం ఏమిటంటే..!
- ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులను పట్టించుకోండి
- 20 వేల మందిలో తెలంగాణకు చెందిన వారు 700 మందికి పైగానే
- వీరందరూ దేశంలోనే వైద్య విద్య కొనసాగించేలా చూడండి
- ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని మోదీకి కేసీఆర్ లేఖ
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి ప్రాణాలు అరచేత బట్టుకుని తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడే మెడికల్ విద్య అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆ లేఖలో ప్రధానిని కేసీఆర్ కోరారు.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు వైద్య విద్య కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు ఏకంగా 20 వేల మంది దాకా వెనక్కు వచ్చేసిన విషయాన్ని గుర్తు చేసిన కేసీఆర్.. వారిలో 700 మందికి పైగా తెలంగాణకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. యుద్ధం నేపథ్యంలో వైద్య విద్యార్థులు ఇప్పుడప్పుడే ఉక్రెయిన్ వెళ్లి విద్య కొనసాగించే అవకాశాలు లేవని కేసీఆర్ తెలిపారు. దీంతో ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు దేశంలోనే వైద్య విద్య కొనసాగించేలా ఓ మంచి నిర్ణయం తీసుకోవాలంటూ ప్రధానికి కేసీఆర్ విన్నవించారు.