ప్రశాంత్ కిశోర్ ఎత్తుగడలు తెలంగాణలో పనిచేయవు: ఈటల
- సిద్ధిపేటలో బీసీ చైతన్య సదస్సు
- హాజరైన ఈటల రాజేందర్
- రాష్ట్రంలో ప్రశాంత్ కిశోర్ ప్రభావం ఉండదని స్పష్టీకరణ
- బీజేపీలో సామాన్యుడు కూడా సీఎం అవుతాడని వెల్లడి
బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నేడు సిద్ధిపేటలో బీసీ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో టీఆర్ఎస్ దోస్తీపై స్పందించారు. ప్రశాంత్ కిశోర్ ఎత్తుగడలు తెలంగాణలో పనిచేయవన్నారు. ప్రశాంత్ కిశోర్ ఆలోచనలకు తెలంగాణలో ఓట్లు రాలడం కష్టమేనని పేర్కొన్నారు. తన నియోజకవర్గం హుజూరాబాద్ లో రూ.600 కోట్లు ఖర్చు చేసినా టీఆర్ఎస్ గెలవలేదని ఈటల స్పష్టం చేశారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబసభ్యులే సీఎం అవుతారని, కానీ బీజేపీలో సామాన్యుడు కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయని వివరించారు. రాజకీయంగా తన ఎదుగుదల చూసి తుంచే ప్రయత్నం చేశారని, భవిష్యత్తులో హరీశ్ రావుకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఈటల వెల్లడించారు. రాష్ట్రంలో వేలకోట్ల విలువైన భూములు అమ్మి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.
బీసీల అంశంపై మాట్లాడుతూ, బీసీలకు బడ్జెట్ లో రూ.5.500 కోట్లు కేటాయించి, ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు. బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఈటల డిమాండ్ చేశారు.