అమెరికా వెళ్లినా, ఐవరీకోస్ట్ వెళ్లినా వదలను.. వైసీపీకి లోకేశ్ వార్నింగ్!
- వైసీపీని టీడీపీతో పోలుస్తూ లోకేశ్ సెటైర్లు
- టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులను ప్రస్తావించిన యువ నేత
- దాడులు చేసిన వారిని వదిలేది లేదంటూ ప్రతిన
- 2024లో టీడీపీ జెండా ఎగరేసి చరిత్ర తిరగరాద్దామంటూ పిలుపు
టీడీపీ 40 వసంతాల వేడుకల సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధికార వైసీపీపై విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ప్రసంగించిన లోకేశ్.. వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌పైనా, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ శ్రేణులను వేధింపులకు గురి చేస్తున్న వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించిన లోకేశ్.. వైసీపీ నేతలు అమెరికా వెళ్లినా, ఐవరీకోస్ట్ వెళ్లినా వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీ అయితే వైసీపీ అధినేత జగన్ ప్రిజనరీ అంటూ మొదలుపెట్టిన లోకేశ్.. టీడీపీని కార్యకర్తల పార్టీగా, వైసీపీని దొంగలు, డెకాయిట్ల పార్టీగా అభివర్ణించారు. టీడీపీ ప్రజల పార్టీ అయితే.. జగన్ రెడ్డిది గాలి పార్టీ అని వ్యాఖ్యానించారు. మహిళలకు టీడీపీ పసుపు కుంకుమ అమలు చేస్తే.. నాన్న బుడ్డితో మహిళల పసుపు కుంకుమను వైసీపీ తుడిచేస్తోందని లోకేశ్ ఆరోపించారు.
చెత్త పన్ను, ఇంటి పన్ను పేరిట ఆస్తులు జప్తుచేస్తున్నారని ఆయన వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. విభజన తర్వాత బంగారు బాతు హైదరాబాద్‌ను కోల్పోయామన్న లోకేశ్..హైదరాబాద్‌కు దీటుగా అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మన నినాదమని చెప్పిన ఆయన.. అభివృద్ధి వికేంద్రీకరణ చేసిన ఘనత చంద్రబాబుదేనని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా బతకకూడదనేది జగన్ విధానంగా చెప్పిన లోకేశ్.. జగన్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని, అందరినీ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న లోకేశ్.. ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలకు సినిమా మొదలవుతోందని హెచ్చరించారు. వైసీపీ నేతలు అమెరికా వెళ్లినా..ఐవరీ కోస్ట్ వెళ్లినా వదిలేది లేదని అన్నారు. తన తల్లిని అవమానించిన వారిని ఎవరినీ వదిలిపెట్టనని శపథం చేసిన లోకేశ్.. తనపై హత్యాయత్నంతో పాటు 11 అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. పోరాటం చేసి ముల్లును ముల్లుతోనే తీద్దామంటూ ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రికార్డులు సృష్టించాలన్నా.. వాటిని తిరగరాయాలన్నా టీడీపీకే సాధ్యమని చెప్పిన లోకేశ్.. నాయకులు, కార్యకర్తలు ఇక ప్రజల్లోనే ఉండాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2024లో టీడీపీ జెండా ఎగరేయాలన్న లోకేశ్.. చరిత్ర తిరగరాద్దామంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.