భార్యను సజీవంగా పూడ్చి పెట్టిన కసాయి భర్త
తమిళనాడులోని వేలూరు సమీపంలో ఘటన
నాలుగేళ్ల క్రితం ప్రేమపెళ్లి
భార్య అనారోగ్యానికి గురికావడంతో గొడవ
గొడవ పడి తీవ్రంగా కొట్టిన భర్త
ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు.. భార్యకు కష్టసుఖాల్లో జీవితాంతం తోడుండాల్సిన అటువంటి యువకుడు ఆమె అనారోగ్యానికి గురి కాగానే కోపం పెంచుకున్నాడు. చివరకు ఆమెతో ఇంట్లో గొడవపడి తీవ్రంగా కొట్టాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో, కొందరి సాయంతో ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సజీవంగా పాతిపెట్టాడు కసాయి భర్త . అతడిని నమ్మిన పాపానికి ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన తమిళనాడులోని వేలూరు సమీపంలో చోటు చేసుకుంది. కాట్పాడి వడుకన్ తాంగల్‌కు చెందిన వినాయకం అనే యువకుడు గుడియాత్తం ప్రాంతానికి చెందిన సుప్రజను నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ పాప కూడా ఉంది. కేవీ కుప్పం సమీపంలోని ముడినాంపట్టులో ఆ దంపతులు నివసిస్తున్నారు. సుప్రజ అనారోగ్యానికి గురి కావడంతో ఆమెతో భర్త వినాయకం గొడవలు పడుతున్నాడు.
ఈ నేపథ్యంలో భార్యను కొట్టి స్పృహ కోల్పోయేలా చేశాడు. అనంతరం తన తమ్ముడు విజయ్, స్నేహితుడు శివకు ఫోన్ చేసి తన ఇంటికి పిలిపించుకున్నాడు. వారంతా కలిసి అర్ధరాత్రి కవసంబట్టు చక్కెరతోపు అటవీ ప్రాంతానికి సుప్రజను తీసుకెళ్లి పాతిపెట్టారు. సుప్రజ కనపడకపోవడంతో పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో భర్తను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అన్ని విషయాలు బయటకు వచ్చాయి. పోలీసులు తదుపరి విచారణ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.