దేవినేని ఉమా అరెస్ట్.. బెజవాడలో ఉద్రిక్తత!
- మైలవరాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలన్న దేవినేని
- డిమాండ్ నెరవేరనందుకు రోడ్డుపై బైఠాయింపు
- దేవినేనికి మద్దతుగా పలు పార్టీల నేతల నిరసన
- దేవినేని సహా కీలక నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
- అందరినీ మైలవరం పోలీస్ స్టేషన్‌కు తరలించిన వైనం
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఏపీ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేవినేని సహా పలువురు టీడీపీ, అఖిల పక్ష నేతలను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు.. అందరినీ మైలవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లకు సంబంధించి తుది జాబితా సిద్ధం చేసిన జగన్ సర్కారు.. ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ ఆమోదానికి పంపిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో మైలవరం లేదన్న విషయాన్ని తెలుసుకున్న దేవినేని ఉమా.. మైలవరాన్ని రెవెన్యూడివిజన్ గా ప్రకటించాలంటూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయనకు మద్దతుగా పలు పార్టీలకు చెందిన నేతలు కూడా రోడ్డుపై బైఠాయించారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. రోడ్డుపై బైఠాయించిన దేవినేని సహా టీడీపీ, ఇతర పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు యత్నించాయి. దీంతో టీడీపీ శ్రేణులపై లాఠీలు ఝుళిపించిన పోలీసులు.. దేవినేని సహా కీలక నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.