Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఫుడింగ్ మింక్ పబ్ కేసును తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు…

ఫుడింగ్ మింక్ పబ్ కేసును తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు… అత్యవసర భేటీ నిర్వహించిన సీవీ ఆనంద్
ఫుడింగ్ మింక్ పబ్ పై పోలీసులు దాడులు
150 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెరపైకి ప్రముఖుల పిల్లలు!
కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు

హైదరాబాదులో ఇటీవల డ్రగ్స్ ప్రకంపనలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ కు బానిసై ఓ బీటెక్ విద్యార్థి మరణించిన కొన్నిరోజులకే నగరంలోని ఫుడింగ్ మింక్ పబ్ పై పోలీసులు దాడి చేయగా, అనేకమంది ప్రముఖుల పిల్లలు పట్టుబడడం సంచలనం సృష్టించింది. దాంతో ఈ కేసును తెలంగాణ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నారు.

తాజాగా, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వెస్ట్ జోన్ పరిధిలోని ఎస్సైలు, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్లు వెంటనే రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. కాగా, పబ్ లో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. ఈ కేసుకు సంబందించిన సాంకేతిక ఆధారాలపై వెస్ట్ జోన్ పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ కేసును నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఈ వ్యవహారంలో పబ్ మేనేజర్ కునాల్ పాత్రపై పోలీసులు దృష్టి పెట్టారు. పార్టీకి డ్రగ్స్ తో వచ్చిన వారికి సెక్యూరిటీ క్లియర్ చేయించింది కునాలేనని భావిస్తున్నారు. స్టఫ్, సోడా, బ్రో, కూల్ వంటి సంకేత నామాలతో డ్రగ్స్ సరఫరా చేసినట్టు అనుమానిస్తున్నారు. పార్టీకి డ్రగ్స్ తో వచ్చిన వారితో కునాల్ అనేక పర్యాయాలు ఫోన్ లో మాట్లాడినట్టు గుర్తించారు. ఈ అంశాలపైనా పోలీసులు నిశితంగా దర్యాప్తు చేసే అవకాశాలున్నాయి.

పబ్ లో నిహారిక…. నాగబాబు ఏమన్నారంటే…!

  • తప్పుడు ప్రచారం చేయొద్దన్న నాగబాబు
  • తన కుమార్తె విషయంలో అంతా క్లియర్ అని వెల్లడి
Nagababu reacts on his daughter Niharika issue

బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ మింక్ పబ్ పై పోలీసులు దాడులు చేయగా, ఆ పబ్ లో నిహారిక కొణిదెల కూడా ఉందన్న వార్తలు సంచలనం సృష్టించాయి. దీనిపై నాగబాబు స్పందించారు. పబ్ లో నిహారిక ఉండడం వల్లే తాను మాట్లాడాల్సి వస్తోందని వెల్లడించారు. నిర్ణీత సమయానికి మించి పబ్ నడుపుతున్నారని పోలీసులు చర్యలు తీసుకున్నారు.

తన కుమార్తె నిహారిక విషయంలో ఎలాంటి సందేహాలు లేవని, అంతా క్లియర్ అని స్పష్టం చేశారు. నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని నాగబాబు వివరించారు. ఇక, ఈ విషయంలో ఎవరూ తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా, మీడియాలో ఊహాగానాలకు తావివ్వరాదన్న ఉద్దేశంతోనే తాను వివరణ ఇవ్వాల్సి వస్తోందని అన్నారు.

పబ్ కేసులో తన కుమారుడి పేరు వినిపించడంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ స్పందన

  • తన కుమారుడు బర్త్ డే వేడుకలకు వెళ్లాడన్న అంజన్
  • పబ్ లు మూసేయించాలని డిమాండ్
Former MP Anjan Kumar Yadav reacts to news

హైదరాబాదు బంజారాహిల్స్ లోని పుడింగ్ మింక్ పబ్ పై పోలీసులు దాడి చేయగా, డ్రగ్స్ పట్టుబడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖులు పట్టుబడడం తెలిసిందే. అయితే, పబ్ కేసు వ్యవహారంలో తన కుమారుడు అరవింద్ పేరు వినిపించడంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పందించారు.

తన కుమారుడు స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలకు వెళ్లాడని వెల్లడించారు. బర్త్ డే పార్టీకి వెళితే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని ఫైవ్ స్టార్ హోటళ్లలో పబ్బులు ఉంటున్నాయని, బర్త్ డే వేడుకలకు ఫైవ్ స్టార్ హోటళ్లకు వెళితే, పబ్బులపై దాడుల సందర్భంగా బర్త్ డే వేడుకలకు వెళ్లిన వాళ్లను కూడా తీసుకెళుతున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుగుతుండడంతో ఓర్వలేక తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబానికి ఇప్పటిదాకా ఎలాంటి చెడ్డపేరు లేదని అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాదు నగరంలో ఉన్న పబ్ లను మూసివేయాలని, లిక్కర్ బ్యాన్‌‌ చేయాలని డిమాండ్ చేశారు. పబ్ వ్యవహారంలో వాస్తవాలు తేల్చాలని కోరారు.

డ్రగ్స్ కేసుతో నాకేం సంబంధం లేదు.. ప్రముఖులను వదిలేసి నాపై నిందలా?: సినీ నటి హేమ

Actor Hema Responded On Drugs Case

డ్రగ్స్ వ్యవహారంపై సినీ నటి హేమ స్పందించారు. కేసులో అనవసరంగా తన పేరును ప్రస్తావిస్తున్నారని ఆమె అభ్యంతరం చెప్పారు. ఏ సంబంధం లేని తనను ఎందుకు బదనాం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో ఉన్న పుడింగ్ అండ్ మింక్ పబ్ లో పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే.

రాహుల్ సిప్లిగంజ్, సినీ నటి నిహారిక సహా పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మళ్లీ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పబ్ కు తాను వెళ్లనేలేదని, కానీ, కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తనపై అభాండాలు వేస్తూ పేరును ప్రసారం చేస్తున్నాయని హేమ ఆరోపించారు. ప్రముఖులను వదిలేసి తనపై నిందలు మోపడమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఇవాళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related posts

కేటీఆర్ కారుపై చెప్పు విసిరే య‌త్నం… రైతు సంఘం నేత అరెస్ట్‌!

Drukpadam

చీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త అరెస్ట్!

Drukpadam

కారులో తిప్పుతూ మోడల్‌పై సామూహిక అత్యాచారం!

Drukpadam

Leave a Comment