Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్ర మంత్రుల‌తో రాజ‌ధాని రైతుల భేటీ.. ఏమేం కోరారంటే..?

కేంద్ర మంత్రుల‌తో రాజ‌ధాని రైతుల భేటీ.. ఏమేం కోరారంటే..?

  • వ‌రుస‌బెట్టి ముగ్గురు మంత్రుల‌తో రైతుల భేటీ
  • సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ నిర్మాణంపై చర్చ‌
  • వ‌చ్చే నెల‌లో శంకుస్థాప‌న చేస్తామ‌న్న మంత్రి రాణే
  • ఆ త‌ర్వాత న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌, నిర్మ‌లా సీతారామ‌న్‌ల‌తో భేటీ

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు ఏక‌బిగిన ముగ్గురు కేంద్ర మంత్రుల‌తో భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో పాటు కేంద్ర మంత్రులు నారాయ‌ణ్ రాణే, న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌ల‌తో రైతులు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా రాజ‌ధానిలో కేంద్రం త‌ర‌ఫున చేప‌ట్టాల్సిన నిర్మాణాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని కేంద్ర మంత్రుల‌ను రాజ‌ధాని రైతులు కోరారు.

ఈ సంద‌ర్భంగా ఎంఎస్ఎంఈ శాఖా మంత్రి నారాయ‌ణ్ రాణేతో భేటీ సంద‌ర్భంగా అమ‌రావ‌తిలో ఏర్పాటు చేయాల్సిన సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అంశాన్ని రైతులు ప్ర‌స్తావించారు. ఈ సంస్థ కోసం రాజ‌ధాని ప‌రిధిలోని శాఖ‌మూరులో 5 ఎక‌రాలు కేటాయించిన‌ట్లు కూడా రైతులు తెలిపారు. ఇక ఆ స్థ‌లం కోసం కేంద్ర ప్ర‌భుత్వం రూ.20.45 ల‌క్ష‌లు చెల్లించిన‌ట్టు కూడా రైతులు మంత్రికి వివ‌రించారు. అదే స‌మ‌యంలో రాజ‌ధాని నిర్మాణాన్ని త్వ‌రిత‌గిన పూర్తి చేయాలంటూ ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాజ‌ధాని రైతులు చెప్పిన అంశాల‌న్నింటినీ సావ‌ధానంగా విన్న కేంద్ర మంత్రి వ‌చ్చే నెల‌లోనే టూల్ డిజైన్‌కు శంకుస్థాప‌న చేస్తామ‌ని రైతుల‌కు హామీ ఇచ్చారు.

నారాయ‌ణ్ రాణేతో భేటీని ముగించుకున్న‌రాజ‌ధాని రైతులు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌తో భేటీ అయ్యారు. వ్య‌వ‌సాయ రంగానికి చెందిన ప‌లు అంశాల‌ను ఆయ‌న‌తో భేటీలో చ‌ర్చించిన రైతులు.. ఆ త‌ర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్ వ‌ద్ద‌కు వెళ్లారు. ఈ భేటీలో రాజ‌ధాని నిర్మాణంలో జ‌రుగుతున్న జాప్యం, కేంద్రం చొర‌వ చూపాల్సిన ఆవ‌శ్య‌క‌త, కేంద్రం నుంచి విడుద‌ల కావాల్సిన నిధులు, రాజధానిలో ఏర్పాటు కావాల్సిన ప‌లు కేంద్ర సంస్థ‌ల‌పై రైతులు కేంద్ర మంత్రికి వివరించారు.

Related posts

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును ధ్రువీకరించిన సీఐడీ…

Drukpadam

కాంగ్రెస్ కు షాక్ -షర్మిల పార్టీలోకి ఇందిరా శోభన్

Drukpadam

నా ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే భయపడతానని అనుకుంటున్నారా ? పవన్ కల్యాణ్!

Drukpadam

Leave a Comment