ఢిల్లీలో తెలంగాణ భవన్ నందు రైతు దీక్ష ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ నామ
-తెలంగాణ రైతాంగంపై కేంద్రం, బీజేపీకి ఎందుకు అంత పగ.
-ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో ఒక మాట ఎంతమాత్రం సరికాదు
-టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు
తెలంగాణ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం ధాన్యo కొనుగోలు విషయంలో అవలంభిస్తున్న ఉదేశ్యపూరిత నిర్లక్ష్యంకి ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు(సోమవారం) జరిగే టి.ఆర్.ఎస్ నిరసన దీక్ష ఏర్పాట్లు ఆదివారం నాడు ఆ పార్టీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పరిశీలించారు. పార్టీ అగ్ర నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకి ఆయన సూచన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం, బీజేపీకి తెలంగాణ రైతులు అంటే
ఎందుకు అంత పగని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అనతికాలంలోనే రైతులు బాగా పంట పండించినందుకే ఈ కక్ష్యనా? అంటూ కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిపై ఆయన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఢిల్లీలో కేంద్రమంత్రులు ఒక విధంగా… రాష్ట్ర బీజేపీ నేతలు మరో విధంగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. ఇటువంటి ద్వంద వైఖరి కారణంగా రాష్ట్రంలోని అమాయక రైతాంగం అయోమయానికి గురవుతుందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు ఢిల్లీకి వస్తే.. మీకేం పని లేదా.. ఎందుకు దిల్లీ వస్తున్నారని తెలంగాణ మంత్రులు, ఎంపీలను అవమానించే విధంగా కేంద్ర మంత్రులు మాట్లాడారని ధ్వజమెత్తారు. తెలంగాణ భారతదేశంలోనే ఉంది కదా.. అలాంటప్పుడు రాష్ట్రంపై కేంద్రానికి ఎందుకంత వివక్ష? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా పన్నులు చెల్లిస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఎంపీ నామ గుర్తు చేశారు. రాష్ట్రం నుంచి భారీ స్థాయిలో ఆదాయం వస్తున్నప్పుడు.. తమ రాష్ట్రం విషయంలో కేంద్రం తన బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. తెలంగాణ రైతులను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ అన్ని విధాలా ప్రయత్నం చేశారని ఎంపీ నామ కొనియాడారు. ధాన్యం విషయంలో కేంద్రం విధానాలు ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఏం చేయాలో తమ ముఖ్యమంత్రికి బాగా తెలుసు అంటూ ఉద్ఘాటించారు. రైతాంగానికి టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ అండగా ఉంటారని చెప్పారు. తమ రైతులను కడుపులో పెట్టి చూసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి అయినా… ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చివరి వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ అని… అలాంటి గడ్డ నుంచి వచ్చిన తాము వెనకడుగు వేసేది లేదని అన్నారు. అందుచేత తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్టు ఎంపీ నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బడుగుల లింగయ్య, ఎంఎల్ఏ మాగంటి గోపీనాథ్, ఖమ్మం జిల్లా రైతు బందు కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్లు టి.ఆర్.ఎస్ నాయకులు బొమ్మెర రాంమూర్తి, బొబ్బిళ్ళపాటి బాబురావు తదితరులున్నారు.