మెడికల్ సీట్ల వ్యవహారం …మంత్రి పువ్వాడ వివరణ రేవంత్ కౌంటర్ …
- నాపై గవర్నర్‌కు తప్పుడు ఫిర్యాదు
- రేవంత్ రెడ్డి ఆరోపణలు పూర్తిగా నిరాధారం
- సీట్లు బ్లాక్ చేయాల్సిన అవసరం మాకు లేదు
- తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవన్న పువ్వాడ
పీజీ మెడికల్ సీట్ల కేటాయింపులో సీట్లను బ్లాక్ చేశారన్న ఆరోపణలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాజాగా స్పందించారు. పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసి దందా సాగించానంటూ తనపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే తన కాలేజీని ప్రభుత్వానికి రాసిస్తానని కూడా ఆయన సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కమార్ ఏమన్నారంటే… “పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందాకు సంబంధించి నాపై గవర్నర్‌కు తప్పుడు ఫిర్యాదు చేశారు. సీట్లు బ్లాక్ చేయాల్సిన అవసరం మాకు లేదు. రేవంత్ రెడ్డి ఆరోపణలు పూర్తిగా నిరాధారం. ఆరోపణలు నిజమని నిరూపిస్తే నా కాలేజీని ప్రభుత్వానికి రాసిస్తా. నిరూపించలేకపోతే రేవంత్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతారా? కాలేజీ ప్రతిష్ఠకు భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
మంత్రి పువ్వాడ వివరణకు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి!
- పీజీ మెడికల్ సీట్ల దందాకు రాజకీయ రంగు
- పువ్వాడ సవాల్‌కు రేవంత్ రెడ్డి ప్రతి సవాల్
- నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్న రేవంత్
- మెడికల్ కౌన్సిల్ తనిఖీలకు సిద్ధమేనా అంటూ ప్రతి సవాల్
పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందా తెలంగాణలో రాజకీయ రంగు పులుముకుంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలోని కాలేజీలే పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందాకు పాల్పడుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి పువ్వాడ స్పందించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని ఆయన చెప్పుకొచ్చారు. పనిలో పనిగా ఆరోపణలు నిరూపించకపోతే..ముక్కు నేలకు రాసి రేవంత్ క్షమాపణ చెబుతారా? అంటూ సవాల్ విసిరారు.
పువ్వాడ సవాల్‌పై రేవంత్ రెడ్డి వెనువెంటనే స్పందించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విసిరిన సవాల్‌కు తాను సిద్ధమేనని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. తన కాలేజీల్లో మెడికల్ కౌన్సిల్ తనిఖీలకు పువ్వాడ సిద్ధమేనా అని ప్రతి సవాల్ విసిరారు. పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందా నిగ్గు తేలాలంటే పువ్వాడ కాలేజీలపై మెడికల్ కౌన్సిల్ విచారణ జరగాల్సి ఉందని రేవంత్ చెప్పారు. పువ్వాడ అజయ్ కుమార్ తప్పు చేశారని నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని రేవంత్ చెప్పారు. మరి మెడికల్ కాలేజీల్లో మెడికల్ కౌన్సిల్ తనిఖీలకు పువ్వాడ అజయ్ సిద్ధమేనా? అని రేవంత్ ప్రతి సవాల్ విసిరారు.