తెలంగాణ వార్తలు

పదేళ్ల క్రితమే లొంగిపోతే ప్రాణ నష్టం తగ్గేది: మాజీ మావోయిస్టు నేత ఆశన్న కీలక వ్యాఖ్యలు…

  • ప్రజల కోసమే తమ ప్రస్థానమన్న ఆశన్న
  • మాజీ మావోయిస్టులు, అమరుల కుటుంబాలతో భేటీ
  • అడవిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటమే లక్ష్యమని స్పష్టీకరణ
  • ఆదివాసీల హక్కుల కోసం 30 ఏళ్లు పోరాడానన్న నేత

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు వాసుదేవరావు అలియాస్ ఆశన్న కీలక వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లిలో సోమవారం ఆయన మాజీ మావోయిస్టులు, అమరుల కుటుంబాలతో సమావేశమయ్యారు. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలో తమ వంతు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

తాము ఏ ఒక్క వర్గానికో పరిమితం కాకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని ఆశన్న తెలిపారు. తమ వెంట ఉన్న వారితో పాటు, ఇంకా అడవిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తామన్నారు. “మేము మావోయిస్టు పార్టీ బలంగా ఉన్నప్పుడే, అంటే పదేళ్ల క్రితమే ఈ లొంగుబాటు నిర్ణయం తీసుకుని ఉంటే ఇంత మంది ప్రాణాలు పోయేవి కావు” అని ఆయన అభిప్రాయపడ్డారు. దండకారణ్యంలో 30 ఏళ్ల పాటు ఆదివాసీల హక్కుల కోసం, నిర్బంధాల మధ్య ప్రశ్నించే గొంతుకగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు.

తన ఉద్యమ ప్రస్థానం మొదలైన భట్టుపల్లితో తనకు విడదీయని అనుబంధం ఉందని ఆశన్న పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట శ్యాందాదా, రాజ్మన్, పద్మ తదితర మాజీ నేతలు ఉన్నారు. మాజీ అగ్రనేతలు అమరుల కుటుంబాలను కలవడం, వారితో చర్చలు జరపడాన్ని పోలీసు నిఘా వర్గాలు అత్యంత నిశితంగా గమనించాయి.

Related posts

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు!

Ram Narayana

ఏది నిజం ..ఏది అబద్దం …రాష్ట్రంలో గ్యాస్ కొరతపై..

Ram Narayana

అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి…

Ram Narayana