కార్మికులకోసం చిరంజీవి ఆసుపత్రి :మే డే వేడుకల్లోకేంద్ర రాష్ట్ర మంత్రులు!
-కరోనా వల్ల సినీ రంగం చాలా నష్టపోయింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
-కరోనా సమయంలో చిరంజీవి కార్మికులకు ఎంతో సహాయం చేశారన్న తలసాని
-అన్నా.. నేను నీ అంత గొప్పవాడ్ని కాదన్నా!: మంత్రి మల్లారెడ్డి
-హైదరాబాదులో మేడే ఉత్సవం
-హాజరైన మంత్రులు కిషన్ రెడ్డి తలసాని మల్లారెడ్డి, చిరంజీవి
-కార్మికుల కోసం చిరంజీవి సినిమాలు తీయాలన్న మంత్రి
సినీ కార్మికులకోసం చిరంజీవి ఆసుపత్రి నిర్మాణం చేయనున్నారని రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , రాష్ట్రమంత్రి మల్లారెడ్డి తో పాటు చిరంజీవి పాల్గొన్న ఫిలిం ఛాంబర్ కార్మికులు జరిపిన మే డే కార్యక్రమంలో వారు ముఖ్య అతిధులు లుగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా సినీ కార్మికుల కష్టాల గురించి వారు మాట్లాడారు .
హైదరాబాదులో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా సంక్షోభం వల్ల సినీ, పర్యాటక రంగాలు ఎంతో నష్టపోయాయని వెల్లడించారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చాక సినీ, పర్యాటక రంగాలు కాస్త నిలదొక్కుకున్నాయని వివరించారు. తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వెనుక కార్మికుల కృషి ఉందని కిషన్ రెడ్డి కొనియాడారు.
దేశంలో 45 కోట్ల మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారని వెల్లడించారు. 5 కోట్ల మంది మాత్రమే సంఘటిత రంగంలో ఉన్నారని తెలిపారు. సంఘటిత రంగ కార్మికులకే ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయని, అందుకే అసంఘటిత రంగ కార్మికులకు కూడా లబ్ది చేకూరేలా ప్రత్యేక చట్టం తెస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఈ-శ్రమ్ కార్డులు తీసుకుంటే కార్మికులకు ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. ఇప్పటికే 28 కోట్ల ఈ-శ్రమ్ కార్డులు పంపిణీ చేసినట్టు తెలిపారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం 29 చట్టాలను 4 చట్టాలుగా మార్చామని వివరించారు. సోషల్ సెక్యూరిటీ బోర్డు చట్టం సినీ కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
సినీ కార్మికుల జీవితాలకు భరోసా లేదు: చిరంజీవి ఆవేదన
ఇవాళ మేడే పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ యూసుఫ్ గూడ కేవీఆర్ మైదానంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. తెలుగు ఫిల్మ్ ఫెడేరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, సినీ కార్మికులు ఎన్నో బాధలను దిగమింగి పనిచేస్తారని వెల్లడించారు. సినీ కార్మికుల జీవితాలకు భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా వేళ కార్మికులకు నిత్యావసరాలు ఇవ్వడం బాధ్యతగా భావించానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులు కలిసి ఉండాలని చిరంజీవి పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వాల సహకారం కావాలని అన్నారు. చిత్ర పరిశ్రమకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎంతో భరోసానిచ్చారని కొనియాడారు.
సినీ కార్మికుల కోసం చిరంజీవి పెద్ద ఆసుపత్రి నిర్మించాలనుకుంటున్నారు: మంత్రి తలసాని
ఇవాళ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా హైదరాబాదులో తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కులా ఉన్నారని, ఎన్ని సమస్యలు వచ్చినా చిత్రసీమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. చిరంజీవి అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని, ఆయన పెద్ద ఆసుపత్రి నిర్మించాలనుకుంటున్నారని తలసాని వెల్లడించారు. తెలుగు చిత్రసీమకు కేసీఆర్ సర్కారు అన్ని విధాలు సహాయ సహకారాలు అందిస్తోందని, సినీ కార్మికులకు చేయూతగా నిలుస్తుందని తెలిపారు.
చిత్రపురిలో ఆసుపత్రి, పాఠశాల నిర్మాణానికి కావాల్సినంత స్థలం ఉందని అన్నారు. చిరంజీవి చిత్రపురిలో ఆసుపత్రి నిర్మిస్తే కొన్ని వేల మంది కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తలసాని అభిప్రాయపడ్డారు. కాగా, తెలుగు సినీ ఇండస్ట్రీకి కులం, మతం లేదని అన్నారు. తెలుగు సినీ కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇళ్లు లేని సినీ కార్మికులకు చిత్రపురిలో ఇళ్లు ఇస్తామని వెల్లడించారు.
మేడే సందర్భంగా హైదరాబాదులో జరిగిన కార్మికోత్సవానికి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఆకాశానికెత్తేశారు.
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… “అన్నా… నేను నీ అభిమానిని అన్నా. నేను నీ అంత ఫేమస్ కాదన్నా! నువ్వు కేంద్రమంత్రివి కూడా అయ్యావు అన్నా. మీ ఫ్యామిలీ అంతా పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారన్నా. మొత్తం ఫిలిం ఇండస్ట్రీనంతా దున్నేస్తున్నావన్నా నువ్వు! నువ్వు అన్నీ సాధించావన్నా! కరోనా సంక్షోభ సమయంలో కార్మికుల కోసం కోట్ల రూపాయలు ఇచ్చావు… వాళ్లను ఆదుకున్నావు. కష్టకాలంలో కార్మికుల కోసం నిలబడింది నువ్వొక్కడివే అన్నా. నాదొక రిక్వెస్ట్ అన్నా… ఇకపై కార్మికుల కోసం సినిమాలు, ఓటీటీ కంటెంట్ తీయాలన్నా. ఓటీటీ కంటెంట్ లో కార్మికులను కూడా భాగస్వాములను చేసి, వాళ్లకు కూడా షేర్ ఇస్తే వాళ్లు గొప్పవాళ్లయిపోతారన్నా!” అంటూ తన మనోభావాలను సభాముఖంగా చిరంజీవికి నివేదించారు.