ముగిసిన రాహుల్ గాంధీ తెలంగాణ టూర్…కాసేపట్లో శంషాబాద్ నుంచి ఢిల్లీకి పయనం
దామోదరం సంజీవయ్యకు రాహుల్ నివాళి
చంచల్‌గూడ జైల్లో ఎన్ఎస్‌యూఐ నేతలకు భరోసా
గాంధీ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు
అమర వీరుల స్థూపాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన తెలంగాణ పర్యటన శనివారం మధ్యాహ్నం ముగిసింది. తెలంగాణలో తన రెండు రోజుల పర్యటనను ముగించుకున్న రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన శంషాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా శుక్రవారం వరంగల్‌లో టీపీసీసీ నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రాహుల్.. రెండో రోజైన శనివారం హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
శనివారం ఉదయం సంజీవయ్య పార్కుకు వెళ్లిన రాహుల్ గాంధీ…మాజీ సీఎం దామోదరం సంజీవయ్యకు నివాళి అర్పించారు. ఆ తర్వాత చంచల్‌గూడ జైలుకు వెళ్లిన రాహుల్ అరెస్టై జైల్లో ఉన్న ఎన్ఎస్‌యూఐ నేతలతో మాట్లాడారు. తదనంతరం నేరుగా గాంధీ భవన్ చేరుకున్న రాహుల్… పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. చివరగా అమరవీరుల స్థూపాన్ని సందర్శించిన రాహుల్ అటు నుంచి అటే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు.