Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్ట్ లు సమాజానికి దారిచూపే దిక్సూచిలా ఉండాలి :పద్మభూషణ్‌ వరప్రసాద్‌ రెడ్డి!

జర్నలిస్ట్ లు సమాజానికి దారిచూపే దిక్సూచిలా ఉండాలి :పద్మభూషణ్‌ వరప్రసాద్‌ రెడ్డి!
సమాజానికి ప్రతికూల ప్రభావం చూపే వార్తలకన్నా అనుకూల వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి
వాస్తవాలను నిర్దారించుకొని వార్తలు రాయాలి
పార్టీలు గా విడిపోయి వారికీ అనుకూలంగా వార్తలు రాయడం బాధాకరం
దేవర్షి నారద జయంతి కార్యక్రమం…పలువురు జర్నలిస్టులకు విశిష్ట, యువ పురస్కారాలు

జర్నలిస్టులు సమాజానికి దారిచూపే దిక్సూచిలా ఉండాలని శాంతా బయోటెక్‌ చైర్మన్‌, పద్మభూషణ్‌ అవార్డుగ్రహీత కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డి ఆకాంక్షించారు.సమాచార భారతి, తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో దేవర్షి నారద జయంతి కార్యక్రమం సందర్భంగా హైద్రాబాద్ లో పలువురు జర్నలిస్టులకు విశిష్ట, యువ పురస్కారాలను అందజేసి, సన్మానించారు. ఈ కార్యక్రమానికి పద్మభూషణ్‌ వరప్రసాద రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పురస్కార గ్రహీతల వ్యక్తిత్వాన్ని, వాళ్లు జర్నలిజంలో సాధించిన విజయాలను కొనియాడారు. వాస్తవాలను, సమాజ పురోగతికి అవసరమైన వార్తలనే మీడియా సంస్థలు ప్రచురించాలని, ప్రసారం చేయాలని ఈ సందర్బంగా సూచించారు.

సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే వార్తలకన్నా అనుకూల ప్రభావం ఉండే వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విశ్లేషణాత్మక కథనాలు పెరగాలన్నారు. ఎవరో చెప్పింది గుడ్డిగా రాయకుండా స్వయంగా ఆ అంశాన్ని పరిశీలించి.. వాస్తవాలను నిర్ధారించుకొని వార్తలను రాయాలని ఉద్బోధించారు. నేటితరం జర్నలిస్టులు వార్తాహరులుగా మాత్రమే కాకుండా పాత్రికేయులుగా వ్యవహరించాలన్నారు. ప్రధానంగా బిజినెస్‌ వార్తలు రాసేటప్పుడు ఆయా కంపెనీలకు సంబంధించిన ప్రొఫైల్‌, వాస్తవ వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కొన్ని మీడియా సంస్థలు పార్టీల వారీగా విడిపోయి వార్తలను సంబంధిత పార్టీలకు అనుకూలంగా మార్చుకొని ఇస్తుండటం బాధాకరమన్నారు. ఇలా చేయడం వల్ల పాఠకులు, వీక్షకులు సందిగ్ధంలో పడే పరిస్థితి నెలకొందని వరప్రసాద రెడ్డి చెప్పారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీనియర్‌ పాత్రికేయులు జి.వల్లీశ్వర్‌ మాట్లాడుతూ నారద మహర్షిని పాత్రికేయులందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నారదుడి ఆకాంక్ష అయిన లోక కల్యాణ భావనలను జర్నలిస్టులు అవగతం చేసుకోవాల్సి ఉందన్నారు. దేశభక్తియుత భావనలను ప్రతి ఒక్కరిలో నింపేలా జర్నలిస్టుల రచనలు ఉండాలని ఆకాంక్షించారు. మనం చేసే ప్రతి పని, ఆచరించే ప్రతి విషయం దేశానికి మేలు చేసేలా ఉందా? అన్నకోణంలో ఆలోచించాలని సూచించారు. సన్మాన గ్రహీతల ప్రత్యేకతలను వల్లీశ్వర్ పరిచయం చేశారు. అలాగే, సమాచార భారతి సంస్థ లక్ష్యాలు, ఆశయాలను వివరించారు.

సమాచార భారతి ఆధ్వర్యంలో సీనియర్‌ పాత్రికేయులు, రచయిత, విమర్శకులు గోవిందరాజు చక్రధర్‌, సీనియర్‌ ఫోటో జర్నలిస్ట్‌ సి.కేశవులు, సీనియర్‌ మహిళా జర్నలిస్ట్‌ సుశ్రీరత్న చోట్‌రాణి, సీనియర్‌ కాలమిస్ట్‌ వుప్పల నరసింహం, సీనియర్‌ పాత్రికేయులు రాజనాల బాలకృష్ణలకు విశిష్ట సేవా పురస్కారాలు అందజేశారు. అలాగే సమాచార భారతి యువ జర్నలిస్ట్‌ పురస్కారాన్ని జీ తెలుగు అవుట్‌‌పుట్‌ ఎడిటర్‌, గూగుల్‌ న్యూస్‌ ఇనిషియేటివ్‌ ఫ్యాక్ట్‌ చెక్‌ ట్రైనర్‌ గోపగోని సప్తగిరికి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార భారతి బాధ్యులు నడింపల్లి ఆయుష్‌తో పాటు.. రాంపల్లి మల్లికార్జున్‌, వడ్డి విజయసారథి, రాజగోపాల్, వేదుల నరసింహం, కొంటు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో జర్నలిస్టులు, ప్రముఖులు హాజరయ్యారు.

Related posts

బాలాపూర్ వినాయకుడి లడ్డూను సీఎం జగన్ కు అందించిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్!

Drukpadam

దొంగదెబ్బ …పెట్రోల్ ,గ్యాస్ పై భారీగా పెంపు!

Drukpadam

పవన్ ఆరోపణలు ఒక్కటైనా నిరూపించగలరా ? పేర్ని నాని సవాల్!

Drukpadam

Leave a Comment