తెలంగాణలో ఉండేది సీఎం కేసీఆర్ ఒక్కరే :మంత్రి కేటీఆర్!
-రాజకీయ పర్యాటకులు వస్తరు, పోతరు
-రాహుల్‌గాంధీ స్టడీ టూర్‌కు స్వాగతం
-తెలంగాణ రైతు విధానాలను నేర్చుకోండి
-మా కంటే మెరుగైన పాలన చూపిస్తారా?
-మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ సవాల్
రాష్ట్రానికి వరుస కడుతున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పొలిటికల్ టూరిస్టులు వస్తారు.. పోతారు. తెలంగాణలో ఉండేది కేసీఆర్ మాత్రమే’ అని ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన మద్దతు లభించింది. ‘నార్త్‌లో కరెంట్ కోతలు తట్టుకోలేక.. మన తెలంగాణకు వస్తున్నారు ఈ పొలిటికల్ టూరిస్టులు. రావొచ్చు పోవొచ్చు.. ప్యారడైజ్ బిర్యానీ తినొచ్చు.. వాళ్లు (బీజేపీ) మీరు (కాంగ్రెస్) సాటుకు పొత్తుపెట్టుకొని తెలంగాణలో పొగపెడతామంటే మాత్రం పొతంబెట్టుడు ఖాయం.. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు వస్తారు, పోతారు. ఎవ్వరు వచ్చినా, ఎంత మంది వచ్చినా ఏం కాదు.. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కేసీఆర్. 67 ఏండ్లలో రైతులను కాంగ్రెస్, టీడీపీ చావకొడితే.. 24 గంటల కరెంట్ ఇచ్చి రైతన్న గల్లా ఎగరేసేలా చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్.. అంటూ ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనను స్వాగతిస్తున్నామని, ఆయన ఇక్కడే కొంతకాలం ఉండి తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకొని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో శుక్రవారం ఓ పోస్టు పెట్టారు. ‘రాహుల్‌గాంధీ స్టడీ టూర్‌ను స్వాగతిస్తున్నాం. ఆయన తెలంగాణలోని ఉత్తమ రైతు స్నేహపూర్వక పద్ధతులను నేర్చుకొని, కాంగ్రెస్ పాలన విఫలమైన రాష్ర్టాల్లో అమలు చేయాలి’ అని చురకలంటించారు.
ఈ సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూను ట్విట్టర్‌లో పంచుకొన్నారు. ‘తెలంగాణ రైతుల విషయంలో రాహుల్‌గాంధీకి ఉన్న సానుభూతిని స్వాగతిస్తున్నాం. కాకపోతే తెలంగాణకంటే మెరుగైన పరిపాలన నమూనా నాకు చూపించాలని రాహుల్‌గాంధీని కోరుతున్నా. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతుబంధు అందిస్తున్నాయా? 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నయా? వ్యవసాయ రుణమాఫీ హామీని నెరవేర్చాయా?’ అని ప్రశ్నించారు.