టీడీపీ అధికార ప్రతినిధిగా ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ నియామకం..
అభినందనలు చెప్పిన కేశినేని శ్వేత
మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ
2017లోనే రాజకీయ రంగ ప్రవేశం
ఇటీవలే టీడీపీ అధికార ప్రతినిధిగా నియామకం
మంగళగిరిలో అచ్చెన్నను కలిసిన గ్రీష్మ
ఆ పదవికి గ్రీష్మ అర్హురాలేనన్న కేశినేని శ్వేత
తెలుగు దేశం పార్టీకి సంబంధించి మరో కీలక నియామకం జరిగింది. పార్టీ అధికా ప్రతినిధిగా కావలి గ్రీష్మను నియమిస్తూ ఇటీవలే పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. టీడీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన ప్రతిభా భారతి వారసురాలిగా 2017లోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన గ్రీష్మ టీడీపీ వ్యవహారాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె సేవలను మరింత మేర వినియోగించుకునే దిశగా ఆమెను అధికార ప్రతినిధిగా పార్టీ నియమించింది. గత ఎన్నికలకంటే ముందు నుంచే గ్రీష్మ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .
ఈ క్రమంలో బుధవారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును గ్రీష్మ మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు పదవి అప్పగించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ యువ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత… ఆ పదవికి అర్హురాలివేనంటూ గ్రీష్మకు అభినందనలు తెలిపారు. చంద్రబాబు యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో పార్టీలోని పెద్దల పిల్లలు రానున్న ఎన్నికలలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది.