Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇకనుంచి ఆఫీస్ కు రావాలన్నందుకు 800 మంది ఉద్యోగానికి గుడ్ బై !

ఇక ఆఫీసుకు రావాలంటూ ఆదేశాలు రావడంతో.. ‘వైట్ హ్యాట్ జూనియర్’లో 800 మంది ఉద్యోగుల రాజీనామా

  • ఐఎన్సీ 42 అనే సంస్థ నివేదికలో వెల్లడి 
  • రెండు నెలల్లో మూకుమ్మడి రాజీనామాలు
  • సంస్థను బైజూస్ కొన్నాక పరిస్థితులు మారాయంటూ ఉద్యోగుల ఆవేదన
  • వివరణ ఇచ్చిన బైజూస్ సంస్థ

కరోనా మహమ్మారి ప్రభావంతో ఇన్నాళ్లూ చాలా సంస్థలు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించాయి. అయితే, కరోనా ప్రభావం తగ్గిపోతుండడంతో ఇప్పుడిప్పుడే కొన్ని సంస్థలు ఆఫీసుకు వచ్చి పనిచేయాలన్న సర్క్యులర్స్ ఇస్తున్నాయి. చాలా మందికి ఆ నిర్ణయం రుచించడం లేదు. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కే ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గినా పూర్తిగా ఇంకా ఆ భయాలు తొలగకపోవడంతో వెనుకాముందాడుతున్నారు. ఆఫీసుకు రావాలన్నందుకు ఇటీవలే ఓ యాపిల్ ఇంజనీర్.. ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

విద్యారంగానికి సంబంధించిన ఆన్ లైన్ సంస్థ వైట్ హ్యాట్ జూనియర్ కూ అదే సమస్య వచ్చిపడింది. ఆఫీసుకు వచ్చి పనిచేయాలన్నందుకు ఒక్కరిద్దరుకాదు.. రెండు నెలల్లో ఏకంగా 800 మంది ఉద్యోగులు సంస్థను వీడిపోయారు. ఐఎన్సీ 42 అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

ఆఫీసుకు వచ్చి పనిచేయడం ఇష్టంలేకే వాళ్లంతా స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించినట్టు నివేదిక పేర్కొంది. ఇక ఆఫీసులకు వచ్చేయాలంటూ ఈ ఏడాది మార్చి 18న ముంబై, బెంగళూరు, గురుగ్రామ్ లోని ఉద్యోగులందరికీ సంస్థ ఆదేశాలిచ్చిందని, ఆ ఆదేశాలు నచ్చక ఉద్యోగులంతా మూకుమ్మడి రాజీనామాలు చేశారని తెలిపింది.

సంస్థను బైజూస్ కొనుగోలు చేశాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పింది. సంస్థ వ్యవస్థాపకుడు కరణ్ బజాజ్ ఉన్నంత వరకు సంస్థ వ్యవహారాలు చాలా స్మూత్ గా సాగాయని, ఆయన వెళ్లిపోయాక అన్నీ రివర్స్ అయ్యాయని వారు చెప్పారని పేర్కొంది.

అయితే, ఈ వ్యవహారంపై బైజూస్ స్పందించింది. ఆఫీసుకు వచ్చి పనిచేయడంలో భాగంగా సేల్స్, సపోర్ట్ స్టాఫ్ ను ఏప్రిల్ 18 నుంచి ఆఫీసుకు రమ్మన్నామని తెలిపింది. అనారోగ్యంతో బాధపడే వాళ్లు, వ్యక్తిగత సమస్యలున్న వారికి మినహాయింపులిచ్చామని పేర్కొంది. అవసరమైతే వేరే చోటుకు మారేందుకూ అవకాశం కల్పించామంది. టీచర్లకు యథావిధిగా వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతోందని తెలిపింది.

2020లో వైట్ హ్యాట్ జూనియర్ ను 30 కోట్ల డాలర్లకు (సుమారు రూ.2,320 కోట్లు) బైజూస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2021 ఆగస్టులో కరణ్ బజాజ్ సంస్థ నుంచి తప్పుకొన్నారు.

Related posts

పోల‌వ‌రం పూర్తయితే భ‌ద్రాచ‌లానికి ముప్పు లేదు: కేంద్ర ప్ర‌భుత్వం..

Drukpadam

ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో ఓడిన వారిని గెలిపించిన అసిస్టెంట్ ఎన్నికల అధికారి

Drukpadam

ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెయిల్.. షరతులు విధించిన హైకోర్టు!

Drukpadam

Leave a Comment