రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్య త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్!
-ఇటీవల రోడ్డు ప్రమాదం
-కాలు విరగడంతో ఆసుపత్రిపాలైన రామయ్య
-అభిమానుల్లో ఆందోళన
-ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై కేసు వద్దన్న వనజీవి రామయ్య
-ఆయనతో 100 మొక్కలు నటించాలన్న వనజీవి
-స్పందించిన పవన్ కల్యాణ్
ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు, వృక్ష ప్రేమికుడు వనజీవి రామయ్య ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికావడం తెలిసిందే. కాలు విరగడంతో ఆయన ఆసుపత్రిపాలయ్యారు. ఐసీయూలో ఉండడం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.
రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన పద్మశ్రీ వనజీవి రామయ్య త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. రామయ్య సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలని అభిలషిస్తున్నట్టు వివరించారు పచ్చదనం కోసం ఆయన పడే తపన, చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలిస్తాయని పేర్కొన్నారు.
కాగా, తాను రోడ్డు ప్రమాదంలో గాయపడడానికి కారకుడైన బైకర్ పై వనజీవి రామయ్య పెద్దమనసు ప్రదర్శించారు. అతడిపై పోలీసు కేసు వద్దని, అతడితో 100 మొక్కలు నాటిస్తే చాలని సూచించారు.