Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ప్రేమ,పెళ్లి పేరుతొ ఇదోరకమైన మోసం ….

ప్రేమ,పెళ్లి పేరుతొ ఇదోరకమైన మోసం ….
-యువతిగా నమ్మించి యువకుడిని ముగ్గులోకి దింపిన 50 ఏళ్ల ఆంటీ..
-పెళ్లికి కూడా సిద్ధమయ్యాక మరో షాకింగ్ ట్విస్ట్!
-కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘటన
-యువకుడికి తనను చూసే అవకాశం ఇవ్వని మహిళ
-పెళ్లి గురించి మాట్లాడేందుకు ‘పిన్నమ్మ’ను పంపిస్తున్నానని తనే వెళ్లిన వైనం
-పెళ్లికి వెళ్లి వధువును కిడ్నాప్ చేశారని డ్రామా
-అనుమానం రావడంతో పోలీసులకు అప్పగించిన యువకుడి కుటుంబ సభ్యులు

ఫేస్‌బుక్‌లో అందమైన యువతి ఫొటో పెట్టి యువకుడిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపిన 50 ఏళ్ల మహిళ పెళ్లి ఖర్చుల కోసం అతడి నుంచి మూడున్నర లక్షలు కొట్టేసింది. ఇదే ట్విస్టు అనుకుంటే ఇంకో షాకింగ్ సీన్ కూడా ఉంది. తన పిన్నమ్మను పంపిస్తున్నానంటూ ఆమే అతడి వద్దకు వచ్చి డబ్బులు తీసుకెళ్లడం గమనార్హం. ఈ కథకు చివర్లో మరో షాకింగ్ ట్విస్ట్ కూడా ఉంది.

ఇలా ట్విస్టుల మీద ట్విస్టులున్న ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యా జిల్లా నాగమంగళ తాలూకాలో జరిగింది. ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఫేస్‌బుక్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. మాటామాట కలిసింది. ప్రేమకు దారితీసింది. అది మరింత ముదరడంతో ఆమెను విడిచి బతకడం సాధ్యం కాదని యువకుడు డిసైడైపోయాడు. జీవితం గురించి ఎన్నో, ఎన్నెన్నో ఊసులు చెప్పుకున్నారు.

తన కలల రాకుమారిని కలవాలని అతడు చాలాసార్లు ప్రయత్నించాడు. అమ్మో! వస్తే ఇంకేమైనా ఉందా? మా అమ్మానాన్నలు చూశారంటే అసలుకే ఎసరు వస్తుందని చెప్పింది. దీంతో ఆమెను కలిసే ప్రయత్నాన్ని అతడు విరమించుకున్నాడు. అయితే, ఆమెపై పెంచుకున్న ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న యువకుడు అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆమె కూడా సరేనంది. మాట్లాడేందుకు తన పినతల్లిని పంపుతున్నట్టు చెప్పింది.

అనుకున్నట్టుగానే ఓ శుభముహూర్తాన ఆమె పినతల్లి వారింటికి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలుపుగోలుగా మాట్లాడింది. పెళ్లికి వారు అంగీకరించడంతో తమవైపు కూడా రెడీ అని చెప్పింది. ఈ క్రమంలో ఇంట్లో వారికి తెలియకుండా యువకుడు ఆమె చేతిలో రూ. 3.50 లక్షలు పెట్టాడు పెళ్లి ఖర్చులకు పనికొస్తాయని. పెళ్లి కూడా ఖరారైంది. ఆదిచుంచనగరి మఠంలో పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. పెళ్లికి వచ్చిన యువతి ‘పినతల్లి’.. పెళ్లి కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడంతో అందరూ హతాశులయ్యారు. అయితే, ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆమె చెప్పింది విని పోలీసులే విస్తుపోయారు. ఫేస్‌బుక్‌లో యువకుడికి పరిచయమైన ఆ యువతి ఈ ‘పిన్నమ్మే’నని తెలిసి అవాక్కయారు. వారే కాదు.. విషయం తెలిసిన యువకుడికి మూర్ఛ వచ్చినంత పనైంది. తన ఫొటోకు బదులుగా మరో యువతి ఫొటోను పెట్టి యువకుడిని బోల్తా కొట్టించినట్టు అంగీకరించింది. అతడి నుంచి తీసుకున్న రూ. 3.50 లక్షలను వెనక్కి ఇచ్చేందుకు ఆమె అంగీకరించడంతో రాజీ కుదిరింది. కథ సుఖాంతమైంది. సో.. ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ పట్ల అప్రమత్తంగా లేకుంటే ‘బుక్’ అయిపోవడం ఖాయం. కాబట్టి జర భద్రం!

Related posts

హైద్రాబాద్ లో దారుణం …భర్త కామానికి భార్య బలి…!

Drukpadam

ఆస్ట్రేలియా అమ్మాయిని భారతీయ వ్యక్తి ఎందుకు హత్య చేశాడంటే…!

Drukpadam

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంటిపై రాళ్లదాడి.. కారు ధ్వంసం!

Drukpadam

Leave a Comment