తడబాటులో పొరపాటు …చంద్రబాబును విమర్శించబోయి జగన్ ను విమర్శించిన మంత్రి!
-చంద్రబాబును విమర్శించబోయి జగన్‌పై ఘాటు వ్యాఖ్య
-గన్నవరం చేరుకున్న సామాజిక చైతన్య యాత్ర
-చంద్రబాబును విమర్శించే క్రమంలో పొరబడ్డ కారుమూరి
-జగన్ అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అంటూ కామెంట్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన మంత్రులు చేపట్టిన సామాజిక చైతన్య యాత్రలో భాగంగా శనివారం ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి దక్కించుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు… తనకు మంత్రి పదవిని ఇచ్చిన జగన్‌పైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అంటూ కారుమూరి వ్యాఖ్యానించారు.
ఈ యాత్ర ప్రారంభం నుంచి వైసీపీ మంత్రులంతా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని టార్గెట్ చేసుకుని విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాత్ర గన్నవరం చేరుకున్న సందర్భంగా మాట్లాడిన కారుమూరి…యథాలాపంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలో చంద్రబాబును అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని అభివర్ణించే యత్నంలో చంద్రబాబు పేరు బదులుగా ఆయన జగన్ పేరును ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అనాల్సిన కారుమూరి… జగన్ అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అంటూ కామెంట్ చేశారు. కారుమూరి నోట నుంచి ఈ మాట రాగానే… యాత్రలో పాల్గొన్న మంత్రులతో పాటు వైసీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి.