- సాధారణంగా జూన్ 1న నైరుతి సీజన్ ప్రారంభం
- ఈసారి మూడ్రోజుల ముందుగానే వచ్చేసిన రుతుపవనాలు
- నేడు కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
సాధారణంగా జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకడం పరిపాటి. కానీ ఈసారి అనుకూల పరిస్థితుల నేపథ్యంలో, నైరుతి సీజన్ మూడ్రోజుల ముందుగానే మొదలైంది. నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకాయి. ఈ మేరకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఓ ప్రకటన చేసింది. ఇటీవల బంగాళాఖాతంలో అసని తుపాను సంభవించగా, ఈ నెల 27నే రుతుపవనాలు కేరళ చేరుకుంటాయని అంచనా వేసినా, రెండ్రోజుల ఆలస్యం అయింది.
ఏదేమైనా, ‘నైరుతి’ ఆగమనంతో దేశంలో వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలగనుంది. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఈ నైరుతి రుతుపవనాల వల్లే కలుగుతుంది. దేశ వ్యవసాయ రంగం కూడా ఈ రుతుపవనాలపైనే అత్యధికంగా ఆధారపడుతోంది. కాగా, ‘నైరుతి’ ప్రభావంతో కేరళలోని అనేక ప్రాంతాల్లోనూ, లక్షద్వీప్ ప్రాంతంలోనూ గణనీయమైన స్థాయిలో వర్షపాతం నమోదైంది.
అయితే, వచ్చే వారం రోజుల వరకు నైరుతి రుతుపవనాలు తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ వరకు విస్తరించే అవకాశాలు లేవని, ఆయా రాష్ట్రాల్లో ‘నైరుతి’ ప్రభావం కనిపించడానికి కొంత సమయం పడుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ పేర్కొంది.