ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి …బీ ఫామ్ అందించిన వైఎస్ జగన్..
-రేపే మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్
-జగన్‌తో మేకపాటి విక్రమ్ రెడ్డి భేటీ
-ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా విక్రమ్ రెడ్డిని నిర్ణయించిన వైసీపీ
-గౌతం రెడ్డి మృతితో ఆత్మకూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో బుధవారం మరో కీలక ఘట్టం పూర్తయింది. ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే ఖరారైన మేకపాటి విక్రమ్ రెడ్డికి ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీ ఫామ్ అందజేశారు. దీంతో రేపు విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ను విక్రమ్ రెడ్డి తన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డితో కలిసి భేటీ అయ్యారు. ఈ భేటీలో విక్రమ్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
జగన్ కేబినెట్‌లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తూ ఇటీవలే గుండెపోటుతో హఠాన్మరణానికి గురైన మేకపాటి గౌతం రెడ్డి మృతితో ఆత్మకూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ స్థానానికి పార్టీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డికి అవకాశం కల్పించాలని మేకపాటి ఫ్యామిలీ జగన్‌ను కోరింది. ఆ మేరకే విక్రమ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేశారు.
ఈ ఎన్నికల్లో పోటీచేయరాదని ఇప్పటికే టీడిపి నిర్ణయం తీసుకోగా , జనసేన కూడా అదే ఆలోచలనలో ఉండాలి. అయితే బీజేపీ పోటీకి సిద్ధమైంది. మేకపాటి బంధువును పోటీపెట్టే ఆలోచనలో బీజేపీ ఉంది. బద్వేల్ ఉప ఎన్నికల్లో కూడా పోటీచేసిన బీజేపీ ఆత్మకూరు లో పోటీచేయాలని నిర్ణయించుకుంది. మరి జనసేన బీజేపీ పోటీచేయడాన్ని సమర్ధిస్తుందా ? లేక కామ్ గా ఉంటుందా ? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఎవరు పోటీచేసిన వైసీపీ గెలుపు నల్లేరు మీద నడక అంటున్నారు పరిశీలకులు ….