Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేంద్రం పై కేసీఆర్ గరం గరం ….

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేంద్రం పై కేసీఆర్ గరం గరం ….
-తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేంద్రంపై ఏదో రకంగా పోరాటం చేస్తూనే ఉన్నాం
-తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేంద్రం వివక్ష చూపుతూనే ఉంది
-ఏడు మండలాలను ఏపీకి కట్టబెట్టింది
-మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు నిధులు ఇవ్వలేదు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో సమైక్య పాలకులు వివక్ష చూపారని… రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే వివక్ష ప్రారంభమయందని చెప్పారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వేడుకలు కూడా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కు కట్టబెట్టిందని అన్నారు.

రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఐదేళ్ల పాటు హైకోర్టును విభజించకుండా తాత్సారం చేసిందని కేసీఆర్ విమర్శించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు రూ. 24 వేల కోట్ల నిధులను ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. కరోనా సమయంలో కూడా ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదని దుయ్యబట్టారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ పక్కన పెట్టేసిందని అన్నారు.

ఐటీఐఆర్ పార్క్ కు కేంద్రం మంగళం పలికిందని కేసీఆర్ దుయ్యబట్టారు. దీన్ని అమలు చేసి ఉంటే ఐటీ రంగంలో తెలంగాణ మరింత పురోగమించేదని తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభించేదని చెప్పారు. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహాన్ని కలిగించేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్రంపై ఏదో రకంగా పోరాటం చేయాల్సి వస్తూనే ఉందని… ఇకపై కూడా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

దళితబంధు ఒక గొప్ప సామాజిక ఉద్యమం: కేసీఆర్

ఇక దళితబంధు ఒక గొప్ప సామాజిక ఉద్యమమని కేసీఆర్ చెప్పారు. అణగారిన దళిత జాతి అభ్యున్నతికి పాటుపడటమే ధ్యేయంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో లబ్ధిదారుడు స్వేచ్ఛగా తనకు వచ్చిన పనిని ఎంచుకోవచ్చని చెప్పారు. ఇటీవల కొత్తగా ఏర్పాటైన వైన్ షాపుల్లో 261 షాపులను దళితులకు కేటాయించామని తెలిపారు. ఇప్పటి వరకు 2.91 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. సొంత స్థలం కలిగిన వారికి దశలవారీగా రూ. 3 లక్షలు మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు కష్టాలకు ముగింపు పలికామని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ఈరోజు ఇళ్లకు, అన్ని రంగాలకు నిరంతరాయంగా, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణే అని తెలిపారు. 2014లో రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగిందని చెప్పారు.

తాగునీటి సమస్యను పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపదికపై మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టామని.. దీని వల్ల ఈరోజు రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు స్వచ్ఛమైన మంచినీరు సరఫరా అవుతోందని కేసీఆర్ చెప్పారు. ఈ పథకానికి నేషనల్ వాటర్ మిషన్ అవార్డు కూడా వచ్చిందని తెలిపారు.

మిషన్ కాకతీయతో పెద్ద ఎత్తున చెరువులను పునరుద్ధరించుకున్నామని కేసీఆర్ చెప్పారు. 15 లక్షలకు పైగా ఎకరాల సాగు భూమిని స్థిరీకరించుకున్నామని తెలిపారు. చెరువుల్లో నీటీ సామర్థ్యం పెరిగిందని చెప్పారు. చెరువులన్నింటినీ సాగునీటి ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం చేశామని… తద్వారా నిండు వేసవిలో కూడా చెరువులు జలకళను సంతరించుకున్నాయని తెలిపారు.

 

Related posts

బీజేపీకి డిపాజిట్లు కూడా రావు, అమిత్ షా సభలో ఇందులో సగం లేరు: హరీష్ రావు…

Drukpadam

అవినాశ్ నేరస్థుడు కాదు.. తప్పించుకోవడమూ లేదు….సజ్జల

Drukpadam

రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతల గృహ నిర్బంధం!

Drukpadam

Leave a Comment