తరచూ వాడే ఈ మందులకు ఇక డాక్టర్ చీటీ అక్కర్లేదు..
చట్టానికి సవరణ చేయనున్న కేంద్రం
ఓటీసీ ప్రొడక్టులుగా జ్వరం సహా 16 రకాల ఔషధాలు
ముసాయిదా నోటిఫికేషన్ ను విడుదల చేసిన కేంద్రం
అభిప్రాయాల కోసం ప్రజలకు అందుబాటులోకి
జ్వరం వచ్చిందనుకోండి.. వెనుకాముందు ఆలోచించకుండా వెంటనే ఓ పారాసిటమాల్ మాత్ర మింగేస్తాం. జలుబు చేసిందంటే చాలు వైద్యుడి దగ్గరకు వెళ్లకుండానే మందులు వాడేస్తుంటాం. తలనొప్పి వచ్చినా, కడుపునొప్పి వచ్చినా.. ఇంకేదైనా చిన్న సమస్య కనిపించినా డాక్టర్ అవసరం లేకుండా సొంత వైద్యం చేసుకునేవాళ్లు బోలెడు మంది ఉన్నారు. చాలా తరచుగా, సాధారణంగా వాడే ఈ మందులకీ ఇప్పటిదాకా ప్రిస్క్రిప్షన్ (డాక్టర్ చీటీ) తప్పనిసరిగా ఉండేది. ఇకపై ఆ రూల్ ను ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
డాక్టర్ చీటీ లేకుండానే కామన్ గా వాడే 16 రకాల ఔషధాలను కౌంటర్ లో అమ్ముకునే మందుల కేటగిరీ (ఓవర్ ద కౌంటర్)లోకి వాటిని మార్చాలని యోచిస్తోంది. అందుకు ఇప్పుడున్న ఔషధ నియంత్రణ చట్టం 1945లో సవరణలు చేయాలని కసరత్తులు చేస్తోంది. గెజిట్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయిన ముసాయిదా నోటిఫికేషన్ ద్వారా ఈ విషయం వెల్లడైంది.
జ్వరం ఔషధాలతో పాటు జలుబు, ముక్కుదిబ్బడ, మలవిసర్జన సాఫీగా జరిగేందుకు తోడ్పడే మందులు (లాగ్జేటివ్స్), నోటిని శుభ్రం చేసే ఔషధ ద్రావణాలు, మొటిమలను పోగొట్టే క్రీములు, నొప్పి తదితర ఔషధాలను ఓటీసీ ప్రొడక్టులుగా మార్చనుంది. అయితే, ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే మందులను ఐదు రోజులకు మించి వాడకూడదని, ఆ మందులను వాడినా ఫలితం లేకుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలనే నిబంధనను జోడించనుంది. ప్రజల ఫీడ్ బ్యాక్ కోసం ముసాయిదా నోటిఫికేషన్ ను కేంద్రం అందరికీ అందుబాటులో ఉంచింది.