జూబ్లీహిల్స్ కేసును పక్కదార్లు పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది:: రేణుకా చౌదరి!
-రఘునందన్ రావు ఇన్నోవా వీడియో ఎందుకు చూపించలేదు
-దోషులను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం కనపడుతుందని విమర్శ
-హైద్రాబాద్ లో మహిళకు రక్షణ లేకుండా పోయింది.
-కొద్దిరోజుల వ్యవధిలోనే ముగ్గురిపై అత్యాచారం జరిగింది.
-వేలకొలది కేసులు నమోదు అవుతున్న 46 కేసుల్లోనే శిక్ష
-ఇదేనా బంగారు తెలంగాణ అంటూ రేణుక చౌదరి ఫైర్
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసును మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై రేణుకా చౌదరి మంగళవారం హైదరాబాద్లో మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు . కొద్దిరోజుల వ్యవధిలోనే ముగ్గురు మహిళలపై లైంగిక దాడులు జరిగినప్పటికీ ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు . తెలంగాణలో పసిపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే అని ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
జూబ్లీహిల్స్ కేసులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉండబట్టే కేసును నీరు కారుస్తున్నారని విమర్శలు గుప్పించారు . ఇలాంటి కేసులు వేలల్లో నమోదైతే కేవలం 46 కేసుల్లో మాత్రమే దోషులకు శిక్ష పడిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని ఆమె స్పష్టం చేశారు. దోషులకు శిక్ష పడాల్సిందే అన్నారు. ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు పెదవి ఇప్పడంలేదని ఆమె ప్రశ్నించారు. మైనర్ బాలిక రేప్ కేసు వీడియో బయటపెట్టిన బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా దోషేనని ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు . వీడియో,ఫొటోస్ బయట పెట్టిన రఘునందన్ రావు ఇన్నోవా కారు ఎందుకు బయట పెట్టలేదని ఆమె ప్రశ్నించారు. విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైద్రాబాద్ లో ఇలాంటి సంఘటనలు జరిగితే పెట్టుబడులు ఎలా వస్తాయని ఆమె ప్రశ్నించారు. పబ్బులకు లైసెన్సులు ఇస్తుంది ఎక్సైజ్ శాఖ కాదా అని ఆమె అన్నారు. ఇందుకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా గ్యాంగ్ రేప్ కేస్ లో అసలు దోషులను అరెస్టు చేసి చట్టప్రకారం శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.