బెంగాల్ లో రెండో రోజూ అల్లర్లు.. పోలీసులపైకి రాళ్లు రువ్విన నిరసనకారులు!
- హౌరాలోని పాంచ్లా బజార్ లో ఘటన
- ఆందోళనకారులపైకి బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు
- ఈ నెల 15 దాకా సిటీలో ఆంక్షలు
మహ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో బెంగాల్ లో రెండో రోజూ అల్లర్లు జరిగాయి. హౌరా జిల్లాలో కొందరు నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేశారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
పాంచ్లా బజార్ లో పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. జూన్ 15 దాకా నిషేధాజ్ఞలను అమలు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇంటర్నెట్ ను 13 దాకా సస్పెండ్ చేశారు.
కాగా, విద్వేషానికి ప్రజలంతా ఏకం కావాలని పశ్చిమబెంగాల్ పోలీసులు పిలుపునిచ్చారు. ప్రజలెవరూ అల్లర్లలో భాగం కారాదని, రెచ్చగొట్టే చర్యలకు పూనుకోకూడదని విజ్ఞప్తి చేశారు. అల్లర్లు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు. ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయవద్దన్నారు. ప్రస్తుతం హౌరాలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. కాగా, శుక్రవారం హౌరాలోని రోడ్లు, రైల్వే ట్రాక్ ను ఆందోళనకారులు బ్లాక్ చేశారు.