బీజేపీ మత రాజకీయాలపై మండిపడ్డ కేటీఆర్ …
-అవి చిల్లర రాజకీయాలంటూ ఖమ్మం సభలో ధ్వజం
-ప్రశాంతంగా ఉన్న దేశంలో మత చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం
-చైనా అభివృద్ధిని పోల్చుతూ సాగిన ఉపన్యాసం
బీజేపీ మత రాజకీయాలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టి చిల్లర రాజకీయాల ద్వారా ఓట్లు పొందాలని చూస్తుందని రాష్ట్ర ఐ టి ,పరిశ్రమలు , పురపాలన శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ రాజకీయాలపై మండిపడ్డారు . ఖమ్మం నియోజకవర్గంలో 100 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధిపనులను ప్రారంభించేందుకు ఖమ్మం వచ్చిన మంత్రి సుడిగాలి పర్యటన చేశారు . ఈ సందర్భంగా సర్దార్ పటేల్ స్టేడియం లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో బీజేపీ ,కాంగ్రెస్ రాజకీయాలపై నిప్పులు చెరిగారు … మతాలు దేవుళ్ళు వేరు వేరు…. ఎవరి విశ్వాసం వారిది …మాదేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని తన్నకునే రాజకీయాలు మనకక్కర్లేదు … …అభివృద్ధి రాజకీయాలు కావాలి … అవి జనహితం కోసం ఉండాలి …. ఊరుకు రోడ్ ఉందా? కరంట్ ఉందా ? మంచినీళ్లు ఉన్నాయా ? అందరికి ఇల్లు ఉన్నాయా ? అనే రాజకీయాలు కావాలి కానీ కుల,మత పిచ్చితో అభివృద్ధిని వెనక్కు నెట్టమని ఏ దేవుడు చెప్పారని ఆయన ప్రశ్నించారు . అందరి దేవుళ్ళు జనహితాన్నే కోరుకున్న విషయాన్నీ ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు .
ఇవాళ మన దేశంలో ఏం జరుగుతుందో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ సూచించారు. ప్రపంచంలో జరుగుతున్న చర్చ గురించి అందరూ ఆలోచించాలి. నిన్న ప్రార్థనల అనంతరం 25 కోట్ల మంది ముస్లిం సోదరులు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఎందుకీ విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నది ఎవరో ఆలోచించాలి. కరెంట్, నీళ్లు లేని గ్రామాల గురించి ఆలోచించాలి. పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచించాలి. కానీ కులం, మతం పేరిటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ, పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టి, ఆ చిచ్చులో చలి మంటలను కాచుకోని, నాలుగు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సవ్యమైన పద్ధతుల్లో ముందుకు పోతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఒకే ఒక్క రోజు రూ. 100 కోట్లతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఖమ్మంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు. గతంలో మురికి కూపంగా ఉన్న లకారం చెరువును అద్భుతంగా అభివృద్ధి చేశారు. లకారం చెరువు వద్ద తీగల వంతెనను ఏర్పాటు చేశాం. రోజుకు 2 వేల మంది అక్కడికి వచ్చి ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి మరో కార్పొరేషన్‌లో జరగడం లేదు. ఖమ్మం నగరాన్ని నెంబర్‌వన్‌గా మార్చాలన్నది మంత్రి అజయ్ లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధిని చూడలేక అసూయతో కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
1987లో భారతదేశం ఆర్థిక పరిస్థితి, చైనా ఆర్థిక పరిస్థితి సేమ్. కానీ ఈ 35 ఏండ్ల తర్వాత చూస్తే.. చైనా 16 ట్రిలియన్ డాలర్లతో ముందుకు దూసుకుపోయింది. మనం మాత్రం 3 ట్రిలియన్ డాలర్లతో వెనుకబడిపోయాం. పేదల సంక్షేమం, దేశ పురోగతి, అభ్యున్నతి, ఎదిగిన దేశాలతోనే మా పోటీ అని చైనా ప్రకటించి, అభివృద్ధిపై దృష్టి సారించింది. ప్రపంచంలోనే నంబర్ వన్‌గా చైనా ఎదిగిందన్నారు. మనకేమో కుల పిచ్చి, మత పిచ్చి ఎక్కువైపోయింది. దీంతో అభివృద్ధి అడుగంటి పోయింది. పంచాయితీలు పెట్టుకోవాలని ఏ దేవుడు కూడా చెప్పలేదని కేటీఆర్ పేర్కొన్నారు.