Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భగ్గుమంటున్న నిరసన జ్వాలలు… అగ్నిపథ్ పై సమీక్ష చేపట్టిన రాజ్ నాథ్ సింగ్

  • సైన్యంలో స్వల్పకాలిక నియామకాలు
  • అగ్నిపథ్ పేరిట నియామక విధానం ప్రకటన
  • కేంద్రం నిర్ణయంపై భగ్గుమంటున్న ఆర్మీ ఆశావహులు
  • దేశంలో పలుచోట్ల ఆందోళనలు

భారత త్రివిధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాలిక నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ విధానం తీవ్ర నిరసన జ్వాలలకు కారణమవుతోంది. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడుతున్న సంఘటనలు దేశంలో పలుచోట్ల చోటుచేసుకున్నాయి. నిన్న సికింద్రాబాద్ లో జరిగిన హింసాత్మక ఘటనలు అగ్నిపథ్ పై వ్యతిరేకతకు పరాకాష్ఠగా నిలిచాయి. అగ్నిపథ్ కారణంగా తమకు అన్యాయం జరుగుతుందని ఆర్మీ ఆశావహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమీక్ష చేపట్టారు. ఢిల్లీలో రాజ్ నాథ్ నివాసంలో నిర్వహించిన ఈ సమీక్షకు, ఆర్మీ నుంచి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బీఎస్ రాజు, ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి హాజరయ్యారు. అగ్నిపథ్ ప్రకటించిన అనంతరం, దేశంలో చోటుచేసుకున్న నిరసనలు, హింసాత్మక ఘటనలను ఈ సమావేశంలో ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. 

కాగా, కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ విధానంపై త్రివిధ దళాలు సంతృప్తికరంగానే ఉన్నాయి. యువతకు అగ్నిపథ్ ఓ సువర్ణావకాశమని, అయితే ఈ పథకం గురించి సరైన అవగాహన లేనందునే నిరసనలు వ్యక్తమవుతున్నాయని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అభిప్రాయపడ్డారు. 

అటు, నేవీ చీఫ్ ఆర్.హరి స్పందిస్తూ, అగ్నిపథ్ పై ఈస్థాయిలో వ్యతిరేకత ఊహించలేదని తెలిపారు. అగ్నిపథ్… భారత సైన్యంలో అతిపెద్ద మానవ వనరుల నియామక ప్రక్రియ అని అభివర్ణించారు. 

ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి కూడా ఈ విధానంపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఈ పద్ధతిని వద్దంటున్నవారు ముందు దీని విధివిధానాలు తెలుసుకోవాలని సూచించారు. అగ్నిపథ్ గురించి పూర్తి సమాచారం పొందాలని, ఈ విధానం తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని అన్నారు.

Related posts

చెన్నై నగరంలో ఐజేయూ సమావేశాలు….

Drukpadam

Drukpadam

26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడిని భారత్‌కు అప్పగించనున్న అమెరికా!

Drukpadam

Leave a Comment