విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా…టీఆర్ యస్ మద్దతు ….
తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా సిన్హా
సివిల్ సర్వీసెస్ వదిలి జనతా పార్టీలో చేరిన సీనియర్ నేత
బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన వైనం
వాజ్‌పేయి సర్కారులో ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన సిన్హా
మోదీ పీఎం అయ్యాక బీజేపీని వీడిన కేంద్ర మాజీ మంత్రి
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా సీనియర్ నేత , మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి యస్వంత్ సిన్హా ను ఎంపిక చేశారు . ఎన్సీపీ నేత శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన 18 ప్రతిపక్ష పార్టీల భేటీ లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమావేశ అనంతరం కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే , శరద్ పవార్ ప్రకటించారు . ఇది ఏకగ్రీవ నిర్ణయమని వెల్లడించారు . సమావేశానికి హాజరుకాని కేసీఆర్ , కేజ్రీవాల్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు . కేసీఆర్ తో శరద్ పవార్ ఫోన్ లో మాట్లాడగా విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారని కూడా తెలిపారు .
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఎంపికయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో మంగళవారం భేటీ అయిన విపక్షాలు సిన్హా అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో సిన్హా పేరు ప్రతిపాదనకు రాగా… భేటీకి హాజరైన మొత్తం 18 పార్టీల ప్రతినిధులు ఆయన అభ్యర్థిత్వాన్నే సమర్థించాయి. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపుతున్నామని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ ప్రకటించారు.
ఇండియన్ సివిల్ సర్వెంట్‌గా పనిచేసిన యశ్వంత్ సిన్హా 1984లో తన సర్వీసుకు రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలుత జనతా పార్టీలో కొనసాగిన ఆయన 1996లో బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన సిన్హా.. అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అటల్ హయాం ముగిసి నరేంద్ర మోదీ ఎంట్రీ ఇచ్చాక పార్టీ విధానాలతో విభేదించిన సిన్హా పార్టీ నుంచి బయటకు వచ్చారు. గతేడాది తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన సిన్హా ఇటీవలే ముగిసిన రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు.
తాజాగా రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలిపే దిశగా ముందుకు సాగగా… అందుకు శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ నిరాకరించారు. ఈ క్రమంలో విపక్షాలు ప్రత్యామ్నాయం కోసం చూడగా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవంతో పాటు దేశంలోని దాదాపుగా అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు కలిగిన యశ్వంత్ సిన్హా పేరు ప్రతిపాదనకు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనకు సిన్హా ఓకే చెప్పేశారు. ఈ క్రమంలోనే విపక్షాల భేటీ కంటే ముందుగానే ఆయన తృణమూల్ కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కేసీఆర్ మద్దతు కూడా సిన్హాకే!… శరద్ పవార్ ప్రకటన!
- విపక్షాల భేటీలోనే కేసీఆర్‌కు ఫోన్ చేసిన శరద్ పవార్
- సిన్హాకు మద్దతు ఇస్తామని కేసీఆర్ చెప్పారన్న ఎన్సీపీ చీఫ్
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలన్నింటి తరఫున ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్న యశ్వంత్ సిన్హా ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో రెండో దఫా భేటీ అయిన విపక్షాలు సిన్హా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో విపక్షాల భేటీకి నేతృత్వం వహించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఓ కీలక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ మద్దతు కూడా యశ్వంత్ సిన్హాకేనని ఆయన ప్రకటించారు. ఈ మేరకు భేటీలో భాగంగా తాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడానని పవార్ చెప్పారు. సిన్హా అభ్యర్థిత్వానికి తాను మద్దతు ఇస్తున్నట్లు కేసీఆర్ చెప్పారని ఆయన తెలిపారు.