‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమైన రైతు సంఘాలు..24న దేశవ్యాప్త నిరసన
- జిల్లా, తహసీల్దార్ కార్యాలయాల్లో శుక్రవారం నిరసనలు
- యువత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరిన ఎస్‌కేఎం
- ఈ నెల 30న నిరసనలకు పిలుపునిచ్చిన బీకేయూ
త్రివిధ దళాల్లో నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ రైతు సంఘాలు కూడా స్పందించాయి. ఈ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 24న దేశవ్యాప్త నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా (SKM) పిలుపునిచ్చింది. ఎస్‌కేఎం 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన సంఘం సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతు నేత రాకేష్ తికాయత్ తెలిపారు.
జిల్లా, తహసీల్దార్ కార్యాలయాల్లో శుక్రవారం జరిగే నిరసన ప్రదర్శనలకు యువత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. భారతీయ కిసాన్ యూనియన్(BKU) కూడా నిరసనల్లో పాల్గొంటుందన్నారు. కాగా, రాకేష్ తికాయత్ నేతృత్వంలోని బీకేయూ కూడా అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 30న నిరసనలకు పిలుపునిచ్చింది.