అరెస్టు భయంతో సికింద్రాబాద్ అల్లర్లలో పాల్గొన్న యువకుడి ఆత్మహత్యాయత్నం..
-పరిస్థితి విషమం ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స
-నిరసన సమయంలో టీవీ ఛానెల్లో మాట్లాడిన జనగాం వాసి గోవింద్ అజయ్
-పురుగుల మందు తాగిన యువకుడు
-ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన వారు ఇప్పుడు పోలీసు కేసులు ఎదుర్కొంటున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొచ్చే వ్యాఖ్యలు, పోస్టులు చేసిన వారిపై కూడా చర్యలకు ఉపక్రమించారు. విధ్వంసానికి పాల్పడిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోబోమని త్రివిధ దళాలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో ఆవేశంగా అల్లర్లలో పాల్గొన్న యువకులు ఇప్పుడు అరెస్టులు పోలీస్ కేసులకు వణికి పోతున్నారు . టీవీ ఛానల్స్ ,సీసీటీవీల్లో వచ్చిన ఫ్యూటేజ్ ఆధారంగా అల్లర్లలో పాల్గొన్నవారిని గుర్తించి మరి కేసులు పెట్టడం జరుగుంది. దానిపై ఒక యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో పాల్గొన్న జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌కు చెందిన గోవింద్ అజయ్ అనే యువకుడు పోలీసులు తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నిరసనల సమయంలో అతను ఓ టీవీ ఛానెల్లో మాట్లాడాడు. దీని ఆధారంగా తనపై కేసు పెడతారని అజయ్ భయపడ్డాడు. దాంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గుర్తించి అజయ్‌ను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.