అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణ టెక్కీ సాయిచరణ్ మృతి!
-అమెరికా గన్ కల్చర్ కు బలైపోతున్న యువకులు
-విమాశ్రయంలో తన మిత్రుడిని దించి వస్తుండగా ఘటన
-నల్లజాతీయుడు కాల్పులు జరిపినట్లు సమాచారం
అమెరికాలో గన్ కల్చర్‌తో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, మేరీలాండ్ నగరంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఓ దుండగుడి కాల్పుల్లో మరణించాడు. మరణించిన టెక్కీని నల్గొండకు చెందిన నక్క సాయి చరణ్(26)గా గుర్తించారు.
యువకుడిపై ఆదివారం కాల్పులు జరపగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయి మృతితో నల్గొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాయి నల్గొండకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు నర్సింహ కుమారుడు.
సాయిచరణ్ అమెరికాలోని బాల్టిమోర్‌లో ఉంటూ గత రెండేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఆదివారం ఉదయం తన మిత్రుడిని కారులో విమానాశ్రయంలో వదిలి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. అతనిపై ఓ నల్లజాతీయుడు కాల్పులు జరిపాడు. దీంతో సాయి చరణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానిక అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాల్పుల ఘటన తర్వాత సాయిని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఆర్. ఆడమ్స్ కౌలీ షాక్ ట్రామా సెంటర్‌కు తరలించారు. అక్కడ అతను కొద్దిసేపటి తర్వాత మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అతని తలపై తుపాకీ గాయం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.