ఆత్మకూరులో రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్…
- ఆత్మకూరులో ముగిసిన పోలింగ్
- సాయంత్రం 5 గంటల సమయానికి 61.70 శాతం పోలింగ్
- పోలింగ్ ముగిసే సరికి 70 శాతానికి చేరి ఉంటుందని అంచనా
- ఆత్మకూరు చరిత్రలో ఇదే అత్యధిక పోలింగ్‌గా అంచనా
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ గురువారం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చిన వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఈ దఫా రికార్డు స్థాయిలో 70 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ఆత్మకూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలోకి దిగగా… టీడీపీ పోటీకి దూరంగా ఉండిపోయింది. బీజేపీ తరఫున భరత్ కుమార్ బరిలో నిలిచారు. వీరిద్దరు సహా మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల దాకా కొనసాగింది. 6 గంటల్లోగా పోలింగ్ కేంద్రాల వల్ల లైన్లలో నిలిచిన వారందరికీ అధికారులు ఓటు హక్కు కల్పించారు. సాయంత్రం 5 గంటల సమయానికే 61.70 శాతం మేర పోలింగ్ నమోదు కాగా… పోలింగ్ ముగిసే సమయానికి ఇది 70 శాతానికి చేరి ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఆత్మకూరు చరిత్రలో ఇదే అత్యధిక పోలింగ్‌గా రికార్డుల్లోకి ఎక్కనుంది.