వాంఖడే మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. చెన్నై నిర్ధేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా (72; 38 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు), శిఖర్ ధావన్ (85; 54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులు) చెన్నై బౌలర్లను ఉతికారేశారు. ఏ ఒక్కరిని వదలకుండా ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయారు. ఆరంభం నుంచి ఈ ఓపెనింగ్ జోడీ ఎదురుదాడికి దిగడంతో ముంబై సునాయాస విజయాన్ని అందుకుంది. దీంతో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ.. ఐపీఎల్ 2021లో బోణీ కొట్టింది.
చెలరేగిన షా, ధావన్:
189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ అదిరే ఆరంభం దక్కింది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ మొదటి ఓవర్ నుంచే తమ బ్యాటుకు పనిచెప్పారు. దీపక్ చహర్, శామ్ కరన్ బౌలింగ్‌లో బౌండరీలు బాదుతూ స్కోర్ వేగాన్ని పెంచారు. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో పృథ్వీ షా వరుసగా మూడు ఫోర్లు బాదడంతో.. ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులెత్తింది. షా చెలరేగడంతో ఢిల్లీ 7 ఓవర్లలో 10 రన్‌రేట్‌తో 70 పరుగులు చేసింది. 10వ ఓవర్ చివరి బంతికి ఫోర్ బాదిన షా.. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. ఆ తర్వాతి ఓవర్లో గబ్బర్ కూడా 35 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు.
లాంఛనాన్ని పూర్తిచేసిన పంత్:
పృథ్వీ షా, శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీల అనంతరం మరింత రెచ్చిపోయారు. బౌండరీలు బాదుతూ ఢిల్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అప్పటికే రెండు జీవనాధారాలు పొందిన పృథ్వీ.. చివరకు బ్రేవో బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. పంత్ అండతో గబ్బర్ వరుస ఫోర్లతో రెచ్చిపోయాడు. 17వ ఓవర్ మూడో బంతికి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. చివరలో స్తోయినీస్ (14) ఔట్ అయినా.. పంత్ (15) మిగతా లాంఛనాన్ని పూర్తిచేశాడు. చెన్నై పేసర్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
రైనా ఫిఫ్టీ:
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రుతురాజ్ గైక్వాడ్ (5), ఫాఫ్ డుప్లెసిస్ (0) విఫలమయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ (36), సురేష్ రైనా (54: 36 బంతుల్లో 3×4, 6×4) మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అశ్విన్ విడదీశాడు. దీంతో జట్టు స్కోరు 60 పరుగుల వద్ద మొయిన్ అలీ ఔటయ్యాడు. అనంతరం వచ్చిన రాయుడుతో కలిసి రైనా చెలరేగి ఆడాడు. చివర్లో శామ్ కరన్ (34: 15 బంతుల్లో) మెరుపులు మెరిపించడంతో చెన్నై 188 పరుగులు చేసింది.