Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సముద్రాన్ని తలపిస్తున్న తెలంగాణ …గోదావరి మరోసారి ఉగ్రరూమం ఈ రాత్రికి 64 అడుగులు

సముద్రాన్ని తలపిస్తున్న తెలంగాణ …గోదావరి మరోసారి ఉగ్రరూమం ఈ రాత్రికి 64 అడుగులు
భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం.. రాష్ట్రమంతా వరదల మయం
ప్రమాదకరంగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు.. రెడ్ అలెర్ట్ జారీ
భారీగా వరద రావడంతో కట్ట పైనుంచి పొంగుతున్న నీళ్లు
రెడ్ అలెర్ట్ జారీ చేసి, సమీప గ్రామస్థులను తరలిస్తున్న అధికారులు
పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి అల్లోల, ఎమ్మెల్యే రేఖా నాయక్

తెలంగాణలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్నాయి.గోదావరి కొన్ని రోజుల్లోనే మరోసారి ఉగ్రరూపం చూపించబోతుంది. మహారాష్ట్ర , ఛత్తీస్ ఘడ్ , రాష్ట్రంలోని పై భాగం లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరదలు పోటెత్తుతున్నాయి. అందువల్ల నిన్నగాక మొన్న మూడవ ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు తగ్గుమొఖం పట్టడంతో ఉపసంహరించుకున్నారు . అయితే తిరిగి వరదలపై కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరికలు జారీచేయడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు .

రాష్ట్రంలో భారీ వర్షంతో పాటు ఎగువ నుంచి నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో ప్రాజెక్టు నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్, జిల్లా ఎస్పీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. ప్రస్తుతం 17 గేట్లు ఎత్తి అధికారులు రెండు లక్షల 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అయినా అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు ఎక్కువ ఉండడంతో ప్రాజెక్టు కట్ట పైనుంచి నీరు ప్రవహిస్తుంది. వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దాంతో, కడెం ప్రాజెక్టు వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు, ప్రాజెక్టు పరిధిలోని 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు.

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి నదికి నీటి ప్రహహం పెరిగింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు . జనజీవనం అస్తవ్యస్తమైంది. మరికొన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నిర్మల్ జిల్లా ముధోల్‌లో నిన్న ఒక్క రోజే 20.3 సెంటీమీటర్ల వాన కురిసింది. 24 గంటల వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గత పదేళ్లలో ఇదే తొలిసారని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 19 జులై 2013న రామగుండంలో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు అదే రికార్డు కాగా, ఇప్పుడది తుడుచిపెట్టుకుపోయింది. రాష్ట్రంలో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.

భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం వద్ద పెద్ద వంతెనపై వాగు పొంగడంతో భైంసా-బాసర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే, పలుచోట్ల రోడ్లు కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకూలాయి. ముస్తాబాద్ మండలం మామిడపల్లికి చెందిన రవి చేపలు పట్టేందుకు వెళ్లి మరణించాడు. మరో 3 రోజుల్లో బంగాళాఖాతంలో మళ్లీ ఉపరితల ఆవర్తనం లేదంటే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అదే జరిగితే మళ్లీ భారీ వర్షాలు తప్పవని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతూ ప్రమాదకరంగా మారాయి. కొన్ని జిల్లాల్లో చెరువులు మత్తడి పోస్తున్నాయి. రానున్న అయిదు రోజుల్లో గోదావరికి భారీ వరదలు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

 

Related posts

కోడిగుడ్డు శాఖాహార‌మే.. తేల్చి చెప్పిన శాస్త్ర‌వేత్త‌లు…

Drukpadam

ఉద్యోగాలకు డిమాండ్ ఉన్నా  భారీగా పడిపోయిన హెచ్1బీ వీసాలు.. 

Drukpadam

ఇడుపులపాయలో వైఎస్సార్ కు రాహుల్ ఘన నివాళి..

Ram Narayana

Leave a Comment