అవును! అత్యాచారం చేశా.. చెబితే చంపేస్తానని తుపాకితో బెదిరించా… -వాంగ్మూలంలో పూసగుచ్చినట్టు వివరించిన మాజీ సీఐ నాగేశ్వరరావు
-కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించిన వనస్థలిపురం పోలీసులు
-తన నేరాన్ని పూసగుచ్చినట్టు వివరించిన నాగేశ్వరరావు
-నాగేశ్వరరావును సస్పెండ్ చేసిన పోలీస్ శాఖ
-నిన్న ఉత్తర్వులు అందించిన వైనం
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడ్‌పల్లి మాజీ సీఐ కె.నాగేశ్వరరావు తన నేరాన్ని అంగీకరించాడు. తన వద్ద పనిచేసే కాపలాదారు భార్యను అత్యాచారం చేశానని, విషయం బయటపెడితే చంపేస్తానని తుపాకితో బెదిరించానని అంగీకరించాడు. అంతేకాదు, లైంగికదాడి ఆనవాళ్లను చెరిపేసేందుకు తన దుస్తులను తానే ఉతుక్కున్నట్టు కూడా చెప్పాడు.
వనస్థలిపురం పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయాలను పేర్కొన్నారు. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేశ్వరరావును పోలీస్ శాఖ సస్పెండ్ చేయగా, మారేడ్‌పల్లి పోలీసులు నిన్న ఆయనకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేశారు.
ఇక పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం.. నాగేశ్వరరావు ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు అంటే నాలుగేళ్ల క్రితం బాధితురాలి భర్తపై క్రెడిట్ కార్డుల మోసానికి సంబంధించి బేగంపేట, మహంకాళి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతడిని అరెస్ట్ చేసిన నాగేశ్వరరావు జైలుకు పంపాడు.
ఆ సమయంలో టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి వచ్చిన బాధితురాలు పుట్టగొడుగుల పెంపకంలో భారీగా నష్టాలు వచ్చాయని నాగేశ్వరరావు వద్ద మొరపెట్టుకుంది. దీనిని తనకు అవకాశంగా మార్చుకున్న నిందితుడు వెలిమేడులో తనకున్న ఫామ్‌హౌస్‌లో పుట్టగొడులు పెంచాలని, కాపలాదారుగా ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. ఆమె భర్త బెయిలుపై బయటకు వచ్చిన తర్వాత తన ఫామ్‌హౌస్‌లో నియమించుకున్నాడు.
ఈ క్రమంలో తరచూ ఫామ్‌హౌస్‌కు వెళ్లి బాధితురాలితో మాట్లాడేవాడు. ఆమె కుమారుడు, కుమార్తెల బర్త్‌డేలకు గిఫ్ట్‌లు కూడా తీసుకెళ్లి ఇచ్చేవాడు. తన కోరికను తీర్చుకునే ఉద్దేశంతో గతేడాది ఫిబ్రవరిలో బాధితురాలిని కారులో ఎక్కించుకుని ఫామ్‌హౌస్‌కు సమీపంలోని మాదాపురం గ్రామంలో స్నేహితురాలి ఇంటి వద్ద దింపాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె తన భర్తకు ఫోన్ చేసి చెప్పడంతో అతడు తీవ్రంగా స్పందించాడు. నాగేశ్వరరావుకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించాడు. దీంతో నాగేశ్వరరావు క్షమించమని ఆమె భర్తను వేడుకున్నాడు.
ఈ నెల 7న బాధితురాలి భర్త ఊళ్లో లేడన్న విషయం తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెప్పొద్దంటూ తుపాకి గురిపెట్టి బెదిరించాడు. అదే సమయంలో ఆమె భర్త రావడంతో ఇద్దరినీ తుపాకితో బెదిరించి కారు ఎక్కించుకుని వారి సొంతూరుకు బయలుదేరాడు. ఆ సమయంలో ఇబ్రహీంపట్నం వద్ద కారు ప్రమాదానికి గురైంది. దీంతో బాధితులిద్దరూ తప్పించుకున్నారు.
నాగేశ్వరరావు ఫోన్లు కూడా కనిపించలేదు. అదే సమయంలో గస్తీ అధికారులు రావడంతో ఆక్టోపస్ అధికారినని వారికి అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కొత్తపేటలోని ఇంటికి వెళ్లి ఆధారాలు లభించకుండా దుస్తులను స్వయంగా ఉతుక్కున్నాడు. ఆ తర్వాత పోలీసు కేసు భయంతో బెంగళూరు పారిపోయానని నాగేశ్వరరావు తన వాంగ్మూలంలో తెలిపినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.