భార్యను చంపాలంటూ కోడలికి సుపారీ ఇచ్చాడు!
- మధ్యప్రదేశ్ లో ఘటన
- మరో పెళ్లికి సిద్ధమైన వ్యక్తి
- కోడలితో భార్యను హత్య చేయించిన వైనం
- కటకటాల్లో మామ, కోడలు
మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చంపాలంటూ స్వయానా కోడలికి సుపారీ ఇచ్చిన ఉదంతం వెల్లడైంది. హత్యానేరం కింద ఇప్పుడా మామ, కోడలు పోలీసుల అదుపులో ఉన్నారు.
ఆ వ్యక్తి పేరు వాల్మీకి కోల్. వయసు 51 సంవత్సరాలు. తన భార్య సరోజ్ (50) చనిపోతే మరో పెళ్లి చేసుకోవాలన్నది అతడి పన్నాగం. అందుకు కోడలి సాయం కోరాడు. అత్తాకోడళ్లకు నిత్యం గొడవలు జరుగుతున్న అంశాన్ని గుర్తించాడు. అత్తను గొంతుకోసి చంపేసేయ్… అంటూ రూ.4 వేల సుపారీ ఇచ్చాడు. అంతేకాదు, ప్రతి నెలా డబ్బు ఇస్తానని తెలిపాడు.
ఆ కోడలి పేరు కాంచన్ కోల్. పాతికేళ్ల ఆ యువతి సరేనంటూ మామ నుంచి సుపారీ పుచ్చుకుంది. అనుకున్నట్టుగానే సరోజ్ హత్య జరగ్గా, ఆ ఘటన అనంతరం వాల్మీకి కోల్ సత్నాలోని బంధువుల ఇంటికి పారిపోయాడు.
జులై 12న ఈ హత్య జరిగింది. తన ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవురాలై ఉన్న స్థితిలో సరోజ్ ను గుర్తించారు. పోలీసుల విచారణలో మామ, కోడలు నిందితులు అని తేలింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ, కోడలు కంచన్ ఓ ఇనుప పెనంతో అత్తను కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయిందని, దాంతో మామ ఇచ్చిన కొడవలితో కాంచన్ అత్త గొంతు కోసి చంపిందని వివరించారు. ఇప్పుడా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.