శ్రీలంక అధ్యక్ష, ప్రధానమంత్రి భవనాల నుంచి 1000కి పైగా కళాఖండాలు మాయం!
- అధ్యక్ష, ప్రధానమంత్రి భవనాల్లోకి చొచ్చుకెళ్లి తిష్టవేసిన నిరసనకారులు
- పురాతన, విలువైన కళాఖండాలు మాయం
- నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు, సాయుధ బలగాలకు అధికారాలు
ఇటీవల శ్రీలంక అధ్యక్ష, ప్రధానమంత్రుల నివాసాల్లోకి దూసుకెళ్లిన నిరసనకారులు విలువైన, అత్యంత పురాతనమైన కళాఖండాలను మాయం చేసినట్టు తాజాగా పోలీసులు వెల్లడించారు. ఈ రెండు భవనాల నుంచి వెయ్యికి పైగా కళాఖండాలు మాయమైనట్టు పోలీసులను ఉటంకిస్తూ స్థానిక వార్తాసంస్థ ఒకటి పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు కూడా ప్రారంభమైనట్టు తెలిపింది. మాయమైన కళాఖండాలకు సంబంధించిన రికార్డులు పురావస్తు శాఖ వద్ద లేకపోవడం అధికారులకు సమస్యగా మారిందని తెలిపింది. అంతేకాదు, 1000కి పైగా వస్తువులు మాయమైనట్టు చెబుతున్నప్పటికీ కచ్చితంగా ఎన్ని ఉంటాయన్న దానిపై ఓ నిర్ధారణకు రాలేకపోతున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అధ్యక్ష, ప్రధానమంత్రి భవనాల్లోకి నిరసనకారులు చొచ్చుకెళ్లడంపై తాజా అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మాట్లాడుతూ.. ఇలా ప్రభుత్వ భవనాలను నిరసనకారులు ఆక్రమించడాన్ని తాను సమర్థించబోనని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను నిరోధించేందుకు పోలీసులకు, సాయుధ బలగాలకు అన్ని అధికారాలు ఇచ్చినట్టు తెలిపారు.