Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జపాన్​ లో బద్దలైన అగ్ని పర్వతం.. జనాన్ని ఖాళీ చేయిస్తున్న అధికారులు!

జపాన్​ లో బద్దలైన అగ్ని పర్వతం.. జనాన్ని ఖాళీ చేయిస్తున్న అధికారులు!

  • దక్షిణ జపాన్ లో కొంతకాలం నుంచి యాక్టివ్ గా ఉన్న సకురజిమా అగ్నిపర్వతం
  • ఆదివారం రాత్రి ఒక్కసారిగా పేలుడు.. భారీగా ఎగసి పడుతున్న లావా
  • అగ్ని పర్వతాలు, భూకంపాలకు నిలయమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉన్న జపాన్
Volcano erupted in Japan Officials are evacuating people

దక్షిణ జపాన్ లోని సకురజిమా అగ్ని పర్వతం ఆదివారం రాత్రి బద్దలైంది. కొంతకాలం నుంచి యాక్టివ్ గా ఉన్న ఈ అగ్నిపర్వతం అప్పుడప్పుడూ స్వల్పంగా పొగ, బూడిదను వెదజల్లుతూ ఉంటుందని.. కానీ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో.. ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో బద్దలవడం మొదలుపెట్టిందని జపాన్ డిప్యూటీ చీఫ్ కేబినెట్ సెక్రెటరీ యషిహికో ఇసోజకి ప్రకటించారు. ఏకంగా ఐదో స్థాయి ప్రమాద హెచ్చరికను జారీ చేశామని.. సమీపంలోని అరిమురా, ఫురుసతో పట్టణాలు, ఇతర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రాత్రి కావడం, చీకటిగా ఉండటం నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదని వెల్లడించారు.

చుట్టూ అంతా చీకటిగా..
సకురజిమా అగ్ని పర్వతం కొన్నేళ్లుగా యాక్టివ్ గా ఉంది. తరచూ బూడిద, పొగను వెదజల్లుతోంది. దానితో అగ్ని పర్వతాన్ని సందర్శించేందుకు, దాని వద్దకు వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. తాజాగా ఆదివారం రోజున ఒక్కసారిగా భారీ ఎత్తున సంభవించిన పేలుడుతో ఏకంగా 2.5 కిలోమీటర్ల ఎత్తున రాళ్లు, దుమ్ము ఎగజిమ్మినట్టు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. అగ్ని పర్వతం నుంచి వెలువడిన దుమ్ము, ధూళి మేఘాల్లో కలిసి.. ఆ ప్రాంతమంతా చీకటి మయంగా మారినట్టు తెలిపింది.

ఆ ప్రాంతమే అగ్ని పర్వతాలు, భూకంపాల నిలయం
  జపాన్ తరచూ భూకంపాలు, అగ్ని పర్వతాల పేలుళ్లకు నిలయమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉంది. అందువల్ల అక్కడి అగ్ని పర్వతాలు యాక్టివ్ గా ఉంటాయి. తరచూ భూకంపాలు కూడా వస్తుంటాయి. వాస్తవానికి సకురజిమా అగ్ని పర్వతం ఒకప్పుడు సముద్రంలో దీవిలా ఉండేది. తరచూ లావాను వెదజల్లి దానితో విస్తృత భూభాగం ఏర్పడింది. అది మెల్లగా జపాన్ ప్రధాన భూభాగానికి అనుసంధానమై కలిసిపోవడం విచిత్రం.

Related posts

షర్మిలకు 14 రోజుల రిమాండ్ …చర్లపల్లి జైలుకు తరలింపు ..

Drukpadam

: వై.ఎస్‌.జ‌గ‌న్‌తో నాగార్జున మీటింగ్.. కార‌ణ‌మేంటి?

Drukpadam

మినిమమ్ బ్యాలెన్స్’ పేరుతో బ్యాంకుల వేల కోట్ల బాదుడు.. పార్లమెంటులో వెల్లడించిన కేంద్రం

Ram Narayana

Leave a Comment