చీకోటి ప్రవీణ్ కస్టమర్ల జాబితాలో ఓ మంత్రి, ఓ మాజీ మంత్రి, 16 మంది ఎమ్మెల్యేలు!
- ప్రవీణ్ కస్టమర్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు
- ఒక్కో ట్రిప్ కోసం ఒక్కొక్కరి వద్ద రూ.5 లక్షల వసూలు
- శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్‌లలో ప్రవీణ్ క్యాసినోలు
- హవాలాకు పాల్పడ్డట్టుగా ఈడీ అధికారులకు ఆధారాలు
- హైదరాబాద్‌కు చెందిన నలుగురు వ్యాపారులపై ఈడీ ఆరా
క్యాసినోలు నిర్వహిస్తూ హవాలా లావాదేవీలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ ఇళ్లు, కార్యాలయాలు, ఫామ్ హౌజ్‌లపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఈడీ అధికారులు పలు కీలక విషయాలను సేకరించారు. అందులో ప్రవీణ్ నడిపిన హవాలా రాకెట్లతో పాటు అతడు నిర్వహించే క్యాసినోలకు రెగ్యులర్‌గా హాజరయ్యే 200 మంది కస్టమర్ల జాబితా కూడా బయటపడిందని తెలుస్తోంది. ఈ జాబితాలో పలువురు బిగ్ షాట్లతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారని సమాచారం.
ఆయా టీవీ ఛానెళ్లు ఈడీ అధికారులను ఊటంకిస్తూ ప్రసారం చేసిన వార్తల ప్రకారం… చీకోటి ప్రవీణ్ క్యాసినోలకు రెగ్యులర్‌గా హాజరయ్యే వారి జాబితాలో ఏకంగా 18 మంది దాకా ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వీరిలో తెలంగాణకు చెందిన ఓ మంత్రి, ఏపీకి చెందిన మాజీ మంత్రి ఉన్నారు.
ఇక మిగిలిన 16 మంది రెండు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు. నేపాల్, ఇండోనేషియా, శ్రీలంకలకు వీరందరినీ తీసుకెళ్లే ప్రవీణ్ వారి కోసం అక్కడ క్యాసినోలు ఏర్పాటు చేసేవాడు. కస్టమర్లను తరలించేందుకు ఒక్కో విమానానికి రూ.50 లక్షలు చెల్లించే ప్రవీణ్… ఆయా దేశాల్లో లగ్జరీ హోటళ్లలో విడిది కోసం రూ.40 లక్షల దాకా ఖర్చు చేసేవాడు. ఇందుకోసం ప్రతి టూర్‌కు ఒక్కొక్కరి వద్ద అతడు రూ.5 లక్షలు వసూలు చేసేవాడు.
ప్రవీణ్‌పై సోదాల సందర్భంగా హవాలా కోణాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన నలుగురు ప్రముఖ వ్యాపారులతో నిత్యం టచ్‌లో ఉంటూ ప్రవీణ్ హవాలాకు పాల్పడ్డాడు. దీంతో అతడు హలావా వ్యాపారం నడిపించిన నలుగురిపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఇక క్యాసినోల నిర్వహణలో భాగంగా భారత కరెన్సీ కంటే కూడా ఇతర దేశాల కరెన్సీనే అతడు స్వీకరించేవాడట. ఈ క్రమంలోనే అతడు హవాలాకు పాల్పడ్డాడని ఈడీ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు.