సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా కె .రామకృష్ణ ఏకగ్రీవ ఎన్నిక!
సహాయ కార్యదర్శులుగా ముప్పాళ్ల , జె వి ఎస్ ఎన్ మూర్తి లు ఎన్నిక
ఏపీ సీఎం పై సిపిఐ కార్యదర్శి విమర్శలు
కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ ఢిల్లీలో తలవంచారు: సీపీఐ రామకృష్ణ
ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలుచేయడంలేదన్న రామకృష్ణ
కేంద్రాన్ని జగన్ నిలదీయడంలేదని వెల్లడి
జగన్ విధానాలతో ఏపీ దివాళా తీస్తోందని ఆందోళన
వరుసగా మూడో సారి సీపీఐ కార్యదర్శిగా రామకృష్ణ ఎన్నిక
సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ కేంద్రంపైనా, సీఎం జగన్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడంలేదని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని పేర్కొన్నారు. కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ ఢిల్లీలో తలవంచారని రామకృష్ణ విమర్శించారు. ఏపీ ప్రయోజనాలపై కేంద్రాన్ని జగన్ నిలదీయడంలేదని అన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ఏపీ ఆర్థికంగా దివాళా తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
జగన్ ఇదే విధానం కొనసాగితే ఏపీలో ప్రజలు ఆయన మెడలు వంచటం ఖాయమని అన్నారు . ఇప్పటికి జగన్ పాలనపట్ల ప్రజల్లో విసుగు వచ్చిందని అందువల్ల రానున్న ఎన్నికల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని అన్నారు . రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని ,ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం పోలీసులకు పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు . అభివృద్ధి మంటగలిసిందని , తమకు ఎదురుతిరిగితే కేసులు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు . ఏపీ లో ఇంతటి నిరంకుశ పాలన గతంలో తాము ఎప్పుడు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు . ఎన్నికల్లో జగన్ పాలనపై ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని రామకృష్ణ అన్నారు .
కాగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ మరోసారి ఏకగ్రీవం అయ్యారు. ఆయన ఏపీ కార్యదర్శిగా ఎన్నిక కావడం వరుసగా మూడోసారి. విశాఖలో జరిగిన 27వ సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నిక జరిపారు. ఇక సీపీఐ ఏపీ సహాయక కార్యదర్శులుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి మరోసారి ఎన్నికయ్యారు.