ఒక చిటికెడు ఉప్పు.. ఏటా లక్షలాది మరణాలు.. ఆ చిటికెడూ తగ్గిస్తే లాభంపై డబ్ల్యూహెచ్ఓ సూచనలివీ!
- అధిక ఉప్పు కారణంగా బీపీ, ఇతర జీవన శైలి వ్యాధుల బారిన పడుతున్న జనం
- ఈ దుష్ఫలితాలతో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ముగ్గురు చనిపోతున్నారన్న డబ్ల్యూహెచ్ఓ
- ప్రజలు అవసరం కంటే రెట్టింపు ఉప్పు వాడుతున్నారని వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం విపరీతంగా పెరిగిపోతోందని.. దీనివల్ల ప్రజలు రక్తపోటు (బీపీ), గుండె జబ్బులు, ఇతర జీవన శైలి వ్యాధుల బారినపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఉప్పు వల్ల ఏర్పడుతున్న దుష్ఫలితాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ముగ్గురు మరణిస్తున్నారని తెలిపింది. ఇటీవల చైనాలో జరిగిన ఓ పరిశోధనతోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ అధ్యయనాలను క్రోడీకరించి ఇటీవల నివేదిక విడుదల చేసింది.
రెండింతల ఉప్పు వాడకంతో..
ఒక సాధారణ వయోజనుడు రోజుకు గరిష్టంగా 5 గ్రాముల మేర మాత్రమే ఉప్పు తీసుకోవాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా సగటున పది గ్రాముల మేర ఉపయోగిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. చైనా, భారత్ వంటి దేశాల్లో సగటు కంటే ఎక్కువగా.. రోజుకు 11 గ్రాములకు పైగా ఉప్పు వినియోగిస్తున్నారని పేర్కొంది. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్త పోటు పెరుగుతుందని.. దానివల్ల గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలు వస్తాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. వీటికితోడు ఇతర జీవన శైలి వ్యాధులు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేసింది.
ఉప్పును నియంత్రిస్తే సగం మరణాలు తగ్గుతాయి
- అధిక ఉప్పు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది గుండెపోటుకు గురవుతున్నారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
- ఇందుకోసం చైనాలోని పరిస్థితిని ఉదహరించింది. చైనాలో ప్రజలు ఇప్పుడు తీసుకుంటున్న ఉప్పులో కేవలం ఒక్క గ్రాము మేర తగ్గించగలిగినా.. వచ్చే ఎనిమిదేళ్లలో (2030 నాటికి) ఏకంగా 90 లక్షల గుండెపోటు కేసులను తగ్గించవచ్చని పేర్కొంది. ఇందులో 40 లక్షల తీవ్రమైన గుండెపోటు సమస్యలూ ఉన్నాయని తెలిపింది.
- ఉప్పు వాడకం నియంత్రించడానికి దశలవారీ లక్ష్యాన్ని పెట్టుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. తొలిదశలో కనీసం మూడో వంతు తగ్గించడం.. అంటే 3.2 గ్రాముల మేర తగ్గించడం అలవాటు చేసుకోవాలని సూచించింది.
- తర్వాత మరింతగా ఉప్పు వాడకాన్ని తగ్గించుకుని.. రోజుకు 5 గ్రాముల గరిష్ట పరిమితికి చేరాలని పేర్కొంది. దీనివల్ల రక్త పోటు బాధితుల సంఖ్య బాగా తగ్గిపోతుందని.. గుండెపోటు, దానివల్ల నమోదయ్యే మరణాలను ఏకంగా సగానికిపైగా తగ్గించవచ్చని తెలిపింది.
- డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం.. దక్షిణాఫ్రికాలో సగటు ఉప్పు వినియోగాన్ని 0.85 గ్రాములు తగ్గించడంతో ఏడాదికి 7,400 మరణాలు తగ్గినట్టు అంచనా వేశారు.
- దక్షిణ కొరియాలో బయట విక్రయించే అన్ని ఆహార పదార్థాల్లో ఉప్పు శాతాన్ని 24 శాతం తగ్గించగా.. రక్తపోటు రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
- థాయ్ లాండ్‌లో ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉప్పు వినియోగం ఉంది. అక్కడ అదనంగా 25 శాతం మంది ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నారు.