పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్
- ఫామ్ హౌస్ లో క్వారంటైన్ లో ఉన్న పవన్
- చికిత్స అందిస్తున్న ఖమ్మం డాక్టర్ తంగెళ్ల సుమన్
- అవసరమైనప్పుడు ఆక్సిజన్ అందిస్తున్నట్టు తెలిపిన జనసేన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్యంగానే ఉన్నారని… ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని జనసేన తెలిపింది. నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోందని చెప్పింది.
తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొని హైదరాబాదుకు చేరుకున్న తర్వాత నలతగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలను చేయించుకున్నారని… రిపోర్టులో ఆయనకు నెగెటివ్ అని వచ్చిందని వెల్లడించింది.
డాక్టర్ల సూచన మేరకు పవన్ తన ఫామ్ హౌస్ లో క్వారంటైన్ కు వెళ్లారని… అయితే అక్కడ ఆయనకు కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చాయిని… అనంతరం మరోసారి టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని జనసేన తెలిపింది. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్ హైదరాబాదుకు వచ్చి పవన్ కు చికిత్స ప్రారంభించారని వెల్లడించింది. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నెమ్ము చేరడంతో యాంటీ వైరల్ మందులతో చికిత్స చేస్తున్నారని తెలిపింది. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా అందిస్తున్నారని చెప్పింది.
ఈ నెల 4న జరిగిన ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న దిల్ రాజు, బండ్ల గణేశ్ లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.