2024లో బీజేపీ ఓడిపోతుంది: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి!
–ఢిల్లీలో ఏచూరితో చౌతాలా భేటీ
–జాతీయ రాజకీయాలపై చర్చ
–విపక్షాలన్నీ ఏకమవుతున్నాయన్న ఏచూరి
–మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని వ్యాఖ్య
వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి జోశ్యం చెప్పారు . ఇటీవల ప్రతిపక్షపార్టీలు తరుచు వామపక్ష పార్టీలను కలవడం జాతీయ రాజకీయాలపై తరుచు చర్చలు జరపడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలపై ఆయన స్పందించారు . బీజేపీయేతర పార్టీలన్నీ రానున్న ఎన్నికల్లో ఏకమైయ్యేందుకు జరుగుతున్నా ప్రయత్నాలు ఊపందుకున్నాయి .ప్రతిపక్షాలను ఐక్యం చేయడంలో కొందరు సీఎం లతో పటు సిపిఎం కార్యదర్శి ఏచూరి కీలక పాత్ర వహిస్తున్నారు . ఇప్పటికే రాజస్థాన్ , ఛత్తీస్ ఘడ్ , తమిళనాడు , తెలంగాణ , కేరళ , బీహార్ , బెంగాల్ ఝార్ఖండ్ ఢిల్లీ ,పంజాబ్ లాంటి రాష్ట్రాలు , ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్నాయి. మొన్నటివరకు ప్రతిపక్షాల చేతిలో ఉన్న మహారాష్ట్ర, బీజేపీ ఆధీనంలోకి పోయింది. అదే విధంగా ఒడిశా , ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కేంద్రంలోని బీజేపీ కి అనుకూలంగా ఉన్నాయి. దేశంలోని రాజకీయాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ కేంద్రంలోని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రయత్నిస్తుంది. అదే విధంగా ప్రతిపక్ష సీఎంలు కేసీఆర్ , నితీష్ , స్టాలిన్. మమతా బెనర్జీ లతోపాటు శరద్ పవర్ , సీతారాం ఏచూరి ,ఫరూక్ అబ్దుల్లా ,అరవింద్ కెజ్రీవాల్, డి రాజా లాంటి నేతలు కృషి చేస్తున్నారు . సోనియా గాంధీ కూడా ప్రతిపక్షాల ఐక్యతకు తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. రాహుల్ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు .
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలు, త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని చెప్పిన ఏచూరి.. మునుగోడు ఎన్నికల్లోనూ బీజేపీకి ఓటమి తప్పదని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించే పార్టీ టీఆర్ఎస్సేనన్న ఏచూరి… ఈ కారణంగానే తాము టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు.
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం ఢిల్లీలో సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు. త్వరలో హర్యానాలో జరగనున్న సమ్మాన్ దివాస్‌కు రావాలంటూ ఆయన ఏచూరిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిద్దరూ జాతీయ రాజకీయాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా 2024 ఎన్నికలపై ఏచూరి పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయన్న ఏచూరి.. అదో మంచి పరిణామం అని వ్యాఖ్యానించారు.