షాకింగ్: కారును రెండు కిలోమీటర్లు ఈడ్చుకుపోయిన కంటెయినర్ లారీ.. పూణె-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘటననిప్పు రవ్వలు ఎగసిపడుతున్నా పట్టించుకోని లారీ డ్రైవర్
కారులోని నలుగురు ప్రయాణికులు సురక్షితం
పూణె-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఓ కారును కంటెయినర్ ట్రక్ రెండు కిలోమీటర్ల మేర ఈడ్చుకుపోయింది. రాపిడికి రోడ్డుపై నిప్పు రవ్వలు ఎగిరిపడుతున్నా లారీ డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదృష్టవశాత్తు కారులోని నలుగురు ప్రయాణికులు తప్పించుకున్నారు. కారును ఈడ్చుకెళ్తున్న లారీని చూసిన రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు, రోడ్డుపక్కనున్న వారు షాకయ్యారు.
మరోపక్క, మహారాష్ట్ర శనివారం రక్తమోడింది. వివిధ ఘటనల్లో పదిమంది ప్రాణాలు కోల్పోయారు. నాగ్‌పూర్‌లో వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ముందువెళ్తున్న బైక్‌లను ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు 80 అడుగుల ఎత్తయిన సకర్దారా ఫ్లైఓవర్ పై నుంచి కిందపడి మరణించారు. కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
మరో ఘటనలో నలుగురు భక్తులు మృతి చెందారు. మహారాష్ట్ర నుంచి భక్తులను తీసుకెళ్తున్న వాహనం హరిద్వార్ నుంచి బద్రీనాథ్ ధామ్‌కు వెళ్తుండగా అదుపు తప్పి లోయలో పడింది. వాహనంలోని ఆరుగురు భక్తుల్లో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నందర్‌బార్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు.